కీర్తనలు భద్రాచల రామదాసు శరణాగత రక్షణ బిరుదనినే శరణంటి గదయ్యా
యమునా కల్యాణి - ఏక ( - ఆది)
పల్లవి:
శరణాగత రక్షణ బిరుదనినే శరణంటి గదయ్యా
వెరువకుమని యభయంబొసంగవే నను గన్నతండ్రివయ్యా శ..
చరణము(లు):
కరివరదా సిరులొసగను దశరథకుమార రావయ్యా
నిరతము నీ నామము జిహ్వకు రుచికరమది యీవయ్యా శ..
నరహరి బాలుని గాచిన శ్రీజగన్నాథా వినవయ్యా
గరుడవాహనుడవై నా కన్నుల గనుపింపవయ్యా శ..
ఆదిదేవ మీ చిత్తము భాగ్యము ఆదరింపవయ్యా
నీ దాసులకును నే దాసుడ దయయుంచి యేలుమయ్యా శ..
హరి నీ తోటి సమానమైన మా యాప్తులెవరయ్యా
కరుణాసాగరుడవని మొరలిడగా కనికరించవేమయ్యా శ..
కోరితి నా దైవము నీవేయనుకొంటిని గదయ్యా
నేరములెంచక గారవించి కృప నేలు నల్లనయ్యా శ..
మురిపెముగా శ్రీరామదాసుడని ముచ్చటలాడుమయ్యా
నరులను బ్రోచెడి భద్రాచలపతి నీవు గాదటయ్యా శ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - sharaNaagata raxaNa birudaninee sharaNaMTi gadayyaa ( telugu andhra )