కీర్తనలు భద్రాచల రామదాసు శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా శ్రీ..
గౌళిపంతువరాళి - ఆది (పూరీకళ్యాణి - ఝంప)
పల్లవి:
శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా శ్రీ..
చరణము(లు):
కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీనామ మేమిరుచిరా శ్రీ..
కదళీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన నీనామ మేమిరుచిరా శ్రీ..
నవరసములకన్న నవనీతములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా శ్రీ..
పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా శ్రీ..
అంజనతనయ హృత్కమలంబునందు రంజిల్లు నీనామమేమిరుచిరా శ్రీ..
శ్రీసదాశివుడు తానేవేళ భజియించు శుభరూప నీనామ మేమిరుచిరా శ్రీ..
సారములేని సంసార తరణమునకు తారకము నీనామమేమిరుచిరా శ్రీ..
శరణన్న జనులను సరగున రక్షించు బిరుదుగల్గిన నామమేమిరుచిరా శ్రీ..
తుంబుర నారదుల్‌ డంబుమీరగ గానంబుజేసెడి నీనామమేమిరుచిరా శ్రీ..
అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - shriiraama niinaama meemiruchiraa ooraama niinaama meMtaruchiraa shrii.. ( telugu andhra )