| కీర్తనలు | భద్రాచల రామదాసు | శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై యున్నది యున్నది |
| ధన్యాసి - ఆది (అఠానా - తిశ్ర ఏక) |
| పల్లవి: |
| శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై యున్నది యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది యున్నది శ్రీ.. |
| చరణము(లు): |
| ఘోరమైన పాతకముల గొట్టేనన్నది మిమ్ము జేరకుండ ఆపదల జెండేనన్నది అన్నది శ్రీ.. |
| దారి తెలియని యమదూతలను తరిమెనన్నది అన్నది శ్రీమ న్నారాయణ దాసులైనవారికి అనువై యున్నది యున్నది శ్రీ.. |
| మాయావాదుల పొందిక మానమన్నది అన్నది మీ కాయము లస్థిరములని తలపోయుడన్నది అన్నది శ్రీ.. |
| బాయక గురురాయని బోధ చేయుడన్నది అన్నది ఏ యెడజూచినగాని తాను ఎడబాయకున్నది ఉన్నది శ్రీ.. |
| కామక్రోధ మోహాంధకారముల మానుడన్నది అన్నది మోదముతో పరస్త్రీల పొందు మోసమన్నది అన్నది శ్రీ.. |
| వలదని దుర్విషయముల వాంఛ విడుడన్నది అన్నది నీ తలపున హరిపాద కమలములుంచ తగునని అన్నది అన్నది శ్రీ.. |
| కోపమనియెడి ప్రకృతిని కొట్టుమన్నది అన్నది యిపుడు ప్రాపు నీవేయనిన దారిజూపెదనన్నది అన్నది శ్రీ.. |
| ఏపుమీర నొరుల దోషము లెన్నకన్నది అన్నది ఏ పాపబంధముల పట్టుపడవద్దని అన్నది అన్నది శ్రీ.. |
| భక్తి భావము తెలిసి మీరు బ్రతుకుడన్నది అన్నది పరమ భక్తులకు సేవజేయుచు ప్రబలుడని అన్నది అన్నది శ్రీ.. |
| ముక్తిమార్గమునకు ఇదే మూలమన్నది అన్నది భక్తుడు భద్రాచల రామదాసుడన్నది అన్నది శ్రీ.. |