కీర్తనలు భద్రాచల రామదాసు శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్న
సావేరి - తిశ్ర ఏక
పల్లవి:
శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్న
ఘోరమైన తపములను కోరనేటికే మనసా శ్రీ..
అను పల్లవి:
తారక శ్రీరామనామ ధ్యానముచేసిన చాలు
వేరువేరు దైవములను వెదుకనేటికే మనసా శ్రీ..
చరణము(లు):
భాగవతుల పాదజలము పైన చల్లుకొన్న చాలు
భాగీరథికి పొయ్యేననే భ్రాంతి యేటికే మనసా
భాగవతుల వాగమృతము పానము చేసిన చాలు
బాగు మీరినట్టి యమృతపానమేటికే మనసా శ్రీ..
పరుల హింస సేయకున్న పరమధర్మమంతే చాలు
పరులను రక్షింతునని పల్కనేటికే మనసా
దొరకొని పరుల ధనముల దోచకయుండితె చాలు
గుఱుతుగాను గోపురము గట్టనేటికే మనసా శ్రీ..
పరగ దీనజనులయందు పక్షముంచినదే చాలు
పరమాత్మునియందు ప్రీతి బెట్టనేల మనసా
హరిదాసులకు పూజలాచరించిన చాలు
హరిని పూజచేతుననే అహమదేటికే మనసా శ్రీ..
జపతపానుష్ఠానములు సలిపిరి మూఢులకై బుధులు
జగదీశుని దివ్యనామచింతన కోసరమై మనసా
చపలము లేకేవేళ చింతించే మహాత్ములకు
జపతపానుష్ఠానములు సేయనేటికే మనసా శ్రీ..
అతిథి వచ్చి ఆకలన్న యన్నమింత నిడిన చాలు
క్రతువుసేయవలెననే కాంక్షయేటికే మనసా
సతతము మా భద్రగిరిస్వామి రామదాసుడైన
నితర మతములని యేటి వెతలవేటికే మనసా శ్రీ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - shriiraamula divyanaamasmaraNa cheeyuchunna ( telugu andhra )