| కీర్తనలు | భద్రాచల రామదాసు | సకలేంద్రియములార సమయముగాదు సద్దుచేయక యిపుడుండరే మీరు |
| కాంభోజి - జంపె (బేగడ - త్రిపుట) |
| పల్లవి: |
| సకలేంద్రియములార సమయముగాదు సద్దుచేయక యిపుడుండరే మీరు ప్రకటముగ మాయింటను జానకీపతిపూజ యను పండుగాయెను మీరు స.. |
| చరణము(లు): |
| నిరతమును పదునాలుగుభువనములు కుక్షిలోనుంచుకొని నిర్వహించెడి స్వామికి ఇరవుగ నా హృదయకమలకర్ణిక మధ్యమున భక్తినుంచికొనియు శరణాగతత్రాణ బిరుదుగల్గిన తండ్రి నను కరుణింపుమనివేడుచు నరసింహదేవునకు నేను పంచామృతస్నాన మొనరింపచేయువేళ స.. |
| తళుకు తళుకున ముద్దు గులుకు జిగికుందనపు నిలువుటంగి దొడిగి నే నలరు ఘుమఘుమ పరిమళించే వనమాలికాహారములు మెడను వేసి లలితకౌస్తుభ దివ్యరత్నాల చొక్కపుతాళి మెడలోవేసియు అల దయాపరవిగ్రహునకు భుజకీర్తులనిడి యవి సవరించువేళ మీరు స.. |
| పదియారువన్నె బంగరుశాలువ దట్టికట్టి విదియచంద్రుని గేరు నుదుట కస్తురి నామమునుదిద్ది తామరలవంటి మృదుపదములందు కదిసి మువ్వలు పాదసరము లందెలు ఘల్లుఘల్లుమన పొంకముగా నుంచియు కదిసి వడ్యాణములు మొలనూలు ఘంటలు హరికినలంకరించువేళ మీరు స.. |
| కౌమోదకీ శంఖచక్రనందక శార్ఙ్గకార్ముకాంచిత కరముల శ్రీమించు కనకంపు హురు మంచిముత్యాల చికిలి కడియములనమర్చి ప్రేమ చక్కవ్రేళ్ళ ముద్దుటుంగరములను ప్రియమొప్ప వీనులయందున మా మనోహరునకు వజ్రముల కర్ణకుండలము లమరించువేళ మీరు స.. |
| శిరమునను శతకోటి సూర్యులనుమించు భాసురకిరీటమును ధరింపజేసి హరిపాదకమలములను మంచి స్వర్ణకుసుమముల పూజచేసి అ గరు ధూపదీపనైవేద్యతాంబూలాది సకలోపచార మొసగి సరసభద్రాద్రీశునకు రామదాసుడు సాష్టాంగ మొనరించువేళ మీరు స.. |