కీర్తనలు భద్రాచల రామదాసు సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ..
సావేరి - చాపు ( - ఆది)
పల్లవి:
సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ..
ఖ్యాతిగ నీ పదపంకంజములు నే
ప్రీతిగ దలపక భేదమెంచితినా సీ..
చరణము(లు):
రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ..
ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని సీ..
తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా సీ..
ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా సీ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - siitaaraamasvaami nee jeesina neeraMbeemi sii.. ( telugu andhra )