| కీర్తనలు | భద్రాచల రామదాసు | స్వామీ నన్ను రక్షింపవేమి సీతారామా |
| సురటి - ఆట |
| పల్లవి: |
| స్వామీ నన్ను రక్షింపవేమి సీతారామా స్వామీ నన్ను రక్షింపవేమి స్వా.. |
| చరణము(లు): |
| మరువక నిన్నే నమ్మి యుంటి నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటి సత్కృపనిక వరములిచ్చువాడని యుంటి ఎందునైన మీ సరివేల్పు లేదని మరిమరి చాటుచుంటి స్వా.. |
| రాతి నాతిగ జేసినావు అజామీళు నిర్హేతుకంబుగ బ్రోచినావు ప్రహ్లాదుని ప్రఖ్యాతి రక్షించినావు ద్రౌపదికి దయచేత చీరలొసగినావు నామీద నేమి హేతువోగాని దయసుంతైన రానియ్యవు స్వా.. |
| లీలా విభూతి జన్మమున నెత్తుచుండెడి మేలు నీపాటి నాకు చాలు ఎంతని బ్రతిమాలుకొందు నను నీపాలు జేయుట పదివేల భాగ్యములు దోషాల చూడక నను నేలుకొంటె నాకు మేలు సంతోషముతోను స్వా.. |
| సకలలోకములు నీలోను లోకముల బాయక నీవు సంతోషముతో నున్నాడవనుచు ప్రకటించె శ్రుతులు పాడగాను కర్ణముల మోదముతోడనే విన్నాను ఇట్టివాడను ఇక నీవు ప్రోవకున్న నెవరు ప్రోచెదరు నన్ను స్వా.. |
| దాసమానసపద్మభృంగా సంతత సద్విలాస పక్షితురంగా శ్రీసీతామనోల్లాస యింద్రనీల శుభాంగ శ్రీభద్రాచలవాసా సకరుణాంతరంగా ఏవేళ రామదాస ప్రసన్నమైన కరుణాసాగరా రామా స్వా.. |