కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు ఆంధ్ర
7. ఆంధ్ర
ఉపనిషన్మీమాంస నోరంత ప్రొద్దుల నవధరించిన పురాణాంధ్రజాతి
సీతమ్మ అతికష్టాలు వినలేక అడవులు పట్టిన ఆంధ్ర జాతి
కురుపాండవుల కత్తికోతల భాగధేయము పంచికొన్నట్టి ఆంధ్రజాతి,
యవనధాటీ ప్రవాహమును బంధించి ఆర్యావర్త మరసిన ఆంధ్రజాతి,
జయవదితిహాస సూత్రభాష్యములు నేడు
త్రవ్వి యెత్తిన ప్రాత ఱాదండకవిలె
జదువు కోవలసెను నమ్మజాలనట్టి
కట్టుకథలట్లు సహింపగలవె ఆంధ్ర!
మగధసామ్రాజ్యసీమలు నీ సితచ్ఛత్ర
ముక్తాఫలచ్ఛాయ మునుగునాడు,
అల కళింగోపాంత మందు కంఖాణ
ఖురధూళి నెఱసందె గురియునాడు,
కర్ణాటరాజ్యరంగముల నీ కవులకు
బ్రహ్మరథంబులు పట్టునాడు,
తంజాపురోద్యాన కుంజమ్ములందు నీ
సంగీతమధుధార పొంగునాడు,
అతిభయంకర శౌర్యధైర్యప్రసక్తి
రస వశంకర నాగర రాగరక్తి
ఏకమై పాకమై ప్రవహించినట్టి
ఆ యఖండప్రభావ మే మాయె నాంధ్ర!
ప్రాకృతపదమంజరీ కంఠముల హాలుడమృతకావ్య ప్రసాదములు పంచె,
బౌద్ధసూత్రార్థముల్‌ ప్రవచించి నాగార్జునుం డహింసాధర్మకాండ నిలిపె,
కన్నడ నుడికి వంకలు తీర్చి పంపడు తొలకరి రచనకు త్రోవదీసె,
సాహిత్యకలశంబు క్షాళించి పండితరాజు క్రొంజవుల క్షీరములు నించె,
అన్యభాషల దూరదేశాంతరముల
నుద్ధరించి ప్రకాశించియును, నిజాంధ్ర
జాతి తంతువిచ్ఛేదంబు సలుపలేరు;
లేదె నీలోన తత్ప్రభాలేశ మాంధ్ర!
తర్కమహాసముద్రమ్ము నాపోశన బట్టె అన్నంభట్ట పండితుండు,
యావదాయుర్వేద జీవనీయచికిత్సలు గదించె బసవరా జగదవేత్త,
జందెమ్ము తెగద్రెంచి క్షాత్రమ్ము నెగయించె అనపోత శర్మ దేశాభిమాని,
గోలకొండకిరీటకోటి కాంతులు దిద్ది రక్కన్న మాదన్న లపరగురులు,
అఖిల పురుషార్థఫలసిద్ధి నందినారు
ఆధిదైవిక భౌతికాభ్యంగణముల
నీ పితామహ మాతామహోపనిధులు
మాయనీయ కాంధ్రుల సంప్రదాయ మాంధ్ర!
నాదధేనువు పిండి నవనీత మందించె త్యాగరాజ స్వామి తన్మయుండు,
లీలాతరంగిణీ కూలతీర్థానందుడయ్యె నారాయణు డమృతమూర్తి,
శ్రీకృష్ణు కాలి గజ్జెల మ్రోతల లయించె పదముల క్షేత్రయ్య పాటకాడు,
కావ్యమాంగల్య రేఖారుచుల్‌ మెఱుగార్చె మల్లినాథ విదగ్ధవల్లభుండు,
సృష్టి నూచు సంగీతసాహిత్యకళల
నుగ్గుబాలతోడుత త్రావి యుమిసి రాంధ్రు
లా జగన్మోహనాస్త్రము లభ్యసింప
దక్షిణము నుత్తరము జూడ దగునె ఆంధ్ర!
విఱిగి వచ్చిన ప్రాణ విభునకు పసుపిచ్చి వేడినీళ్ళను తోడె కోడ లొకతె,
కత్తులతిరునాళ్ళ గవయ వచ్చిన నాథు గొఱకచ్చునుడి దోలె కూతు రొకతె,
కులకక్షల కృశించి కూలనున్న విశాల రాజ్య చక్రము త్రిప్పె రాణి యోర్తు
కవికోకిలమృదూక్తి నవదరించెను తేనె నుడికారమున ఆడుపడు చొకర్తు,
విమలసాహస సౌకుమార్యములు వెలయ
దిఙ్నితంబంబులందు చిత్రించినారు
తమచరిత్ర విచిత్రపత్రముల నాడు
తలప వెట్టు లా జాతి చైతన్య మాంధ్ర!
గడ్డపాఱలు గోగుకాడలవలె ముళ్ళు వేసినారట కొండవీటిరెడ్లు,
తెలివెన్నరాసులతీరున నల్లకొండలు చీల్చినారు పల్నాటిగండ్లు,
శివుడు గంగనుబోలె చెరువుగండి ప్రవాహమాపినా రద్దంకి కాపుమగలు,
వాటెడేసి శిలాకవాటముల్‌ గ్రుద్దుల గదిపినారట తెలంగాణభటులు.
అట్టి బలభద్రులీ భూమి బుట్టినారు
విజయకన్యక వీరగోరజము బూయ
పులికడుపు చలిచీమలపుట్ట యయ్యె
చూడవోయి ప్రాల్మాలికల్‌ వీడి ఆంధ్ర!
పూజింపరే రెడ్డిరాజులు వీరశృంగారహారమ్ములు కాన్కలిచ్చి,
సేవింపరే కమ్మ సేనాపతులు శత్రు రక్తకుంకుమల నరణ మొసంగి,
వెలయింపరే వెల్మ వీరులు బెబ్బులి బిడ్డలై పరసీమ గొడ్డువోవ,
అర్చింపరే బ్రాహ్మణాచార్యు లుభయ భాషా వ్యవసాయ సస్యమ్ములెత్తి,
ఈ మహాంధ్రదేశ భగవతీమతల్లి
నాదినుండి సామ్రాజ్య సమాప్తిదాక
కులము దడివిరె? పొలిమేరగోల బడిరె?
బోయవలె తల్లిపల్లకీ మోయు మాంధ్ర!
పెనుజడల్‌ విరబోసికొని తాండవంబాడు ఈర్ష్యాపిశాచి నట్టింటిలోన,
సవతిబిడ్డవిధాన నవయు తల్లి తెనుంగు విశ్వవిద్యాలయ వీధులందు,
దోషశల్యమ్ములే తోచు నుత్సాహ సంపన్నవ్య సాహిత్య పాలనమున,
పిన్న లూర్ధ్వముఖంబు పెద్ద లథోదృష్టి ఉభయభాగ్యోపాస్తి నుత్తచూపు,
ఈ యభావవేదాంత మే మీయగలదు
చావుబ్రదుకులు తేలు నీ సంధియందు
'నాదు జాతి - నా దేశము - నాదు భాష'
అను అహంకార దర్శన మందు మాంధ్ర!
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - aaMdhra ( telugu andhra )