కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు ఆంధ్రమాత
5. ఆంధ్రమాత
శ్రీలింపొందగ యావదాంధ్ర జనమాతృ క్ష్మాతలీనూత్న తే
జోలీనామృత మాని, తద్బలవదౌత్సుక్యంబునన్‌ తావకో
ద్వేల ప్రాక్తనకీర్తిగీతముల నర్థిన్‌ పాడు నీ పుత్ర పు
త్రీ లోకమ్మున కేమి దెల్పెదవు సందేశంబు నాంధ్రావనీ!
ఆశల్‌ కౌతుక పూర్ణచంద్రికలు పూయన్‌, దుర్దినాచ్ఛాదమా
కాశమ్మున్‌ విడిపోవ, నూతన కళోత్కర్షాప్తిమై మాతృ పూ
జా శోభల్‌ దయివారు నీ శుభదినోత్సాహంబు నీక్షించి, నీ
యాశీర్వాదము లిమ్ము పుత్రకుల కంబా! యాంధ్రదేవీమణీ!
తేటల్‌ దేరెడు కాంతిపూరముల నుద్దీపించు ముత్యాల ము
ప్పేటల్‌ వోలె త్వదీయ కంఠమున శోభింపుల్‌ నిగారించు, చే
నాటన్‌ జీవనశోషణల్‌ గనని కృష్ణా గౌతమీ భద్రలన్‌
గాటంపుం దమి త్రాపువారలిదె కాంక్షాక్షీర మాంధ్రావనీ!
ఆ చాళుక్య నృపాల రత్నముల వియ్యమ్మంది, శ్రీకాకతి
క్ష్మాచక్రేశుల లాలనల్‌ వడసి, కృష్ణప్రాజ్య సామ్రాజ్యపీ
ఠీ చంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్‌ ప్రొద్దువో బుచ్చు నీ
ప్రాచీనాభ్యుదయమ్ము నెన్నెదరు గర్వ స్ఫూర్తి తల్లీ! సుతుల్‌.
ఉద్యన్మోహనమై, కుమారజనగర్వోద్రేకమై, ఈ త్రిలిం
గోద్యానాప్త మధూదయమ్మగు నవీనోత్సహపున్‌వేళ, నా
విద్యారణ్య యుగంధరాదుల యశోవీర్యప్రభావమ్ము లీ
విద్యాస్నాతకు లాసచేసెదరు, దేవీ! సంప్రసాదింపవే.
జాఱిన దేశగర్వమును చక్కనదిద్ది, మహాంధ్రమండలీ
భారము శ్లాఘనీయముగ పాలనచేసి, సమానరాష్ట్రముల్‌
కూరిమి నాసజేయ తెనుగుం బుడమిన్‌ గయిసేయరయ్య, దీ
క్షారతి నాంధ్ర పుత్రులు; జగజ్జనధర్మమె దృష్టి నిల్పుచున్‌.
ఉల్లాసమ్మున మాతృసేవ పయిపై నుఱ్ఱూత లూగంగ, నా
పల్లిపక్కణ దిగ్దిగంతరతలీ పర్యంత వేంగీభువిన్‌
చల్లుండాంధ్రమహోద్యమ ప్రథమ పూజా పుష్పముల్‌; ప్రేమపు
ద్రాళ్లం గట్టుడు యావదాంధ్ర జన సంతానమ్ము నాపైహితుల్‌.
రణరక్త బంధురారుణ మైన ఖడ్గ తి
క్కన కత్తి కడిగిన కదనభూమి,
అమృతాక్షరవికాస మయిన యా సుకవి పో
తనలేఖిని ప్రశాంతి గనినచోటు.
భాషాకుమారి కబ్రపు పెండ్లియిల్లైన
కృష్ణ రాజ్యము వెలింగిన తలమ్ము,
నానావిదేశ నౌకానీక విపులాశ్ర
యం బైన రేవు రూ పఱినతావు.
పాడయి, శిలావశిష్టమై, ప్రాప్తకాల
మనుభవించుచు నుండియు నక్కటకట!
బ్రతికి చెడ్డ యాంధ్రుల పూర్వవైభవములె
చాటుచున్న, వాలింపుడు శాంతమతుల!
కల దంధ్రోద్యమ మల్లికాకుసుమరేఖా మాలికాగంధ తుం
దిల వాల్లభ్యవిశేషముల్‌ భరతధాత్రీ ఛత్ర సింహాసన
స్ఖలితచ్ఛాయల నుజ్జ్వలింపగల భాగ్యం బింక, ఆసాంగ మం
గళ కల్యాణము పాడ పుత్రికలె వేడ్కన్‌ వత్తు రానాటికిన్‌.
సంతోషింపగదమ్మ! ఆంధ్రజననీ! సారస్వతస్నాన వి
శ్రాంతిప్రీతుల, నీదు పుత్రకుల, దీక్షాబద్ధులం జూచి; ని
శ్చింతన్‌ సోదరులార! ఈ జనని పూజింపుండు, బ్రహ్మార్పణో
దంతవ్యక్త మనోబలమ్మున తథాస్తంచున్‌ ఋషుల్‌ పల్కగన్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - aaMdhramaata ( telugu andhra )