కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు ఆచారము
9. ఆచారము
తీరు తీరుల నలంకారముల్‌ మ్రుగ్గులన్‌ చిత్రించు మవ్వంపు చేతిమేల్మి
పూసలతో బొమ్మపోసినయట్లు చక్కని కుట్టుపను లల్లు కౌశలంబు
కైవారములు లేకయే వలయము లష్టదళరేఖల నమర్చు కలికితనము
పాడేటి రాటాల పాలు తీసిన రీతి సన్నదారము దీయు జాణతనము
తెనుగునాటి కులస్త్రీల ననుదినంబు
సన్న సన్నగ నణగారి చచ్చుచున్న
వకట! ఈ గృహజీవదీపికలు నిలువ
స్నేహనిధికి భిక్షాటన సేయ రేమొ!
ఏడాది పొడుగున నింత తీఱిక లేక చేలలో కష్టించు సేద్యకాండ్ర
పెద్దపురాణాల విన నోచుకొనక యూరికి దూరులగు దురదృష్టజనుల
ఉప్పుగల్లుకు గూడ నొడ లమ్మవలసిన ఆధార శూన్యులౌ అనదవాండ్ర
ఇంటి బానిసచాకిరే సర్వమని తూర్పు పడమర లెఱుగని పల్లె సతుల
ఎవ్వడింక తాంబూర వాయించుకొనుచు
దరిసినడుపు ప్రజాహ్లాదతంత్ర మెపుడు?
అన్నకాటక మటు లుండ నావహించె
భూమి నానంద దుర్భిక్షమును సఖుండ!
వినువారి కన్నీరు వినువాకగా బొంగ సీతమ్మ కష్టాలు సెప్పిచెప్పి
వెఱ్ఱిగొల్లడు గూడ నుఱ్ఱూత లూగంగ వీధిభాగవతాలు వేసివేసి
ముసలివాండ్రును మీసములు త్రిప్పి కాకెక్క వీరబొబ్బిలి కథల్‌ వినిచి వినిచి
ఆబాల గోపాల మావేశమున త్రుళ్ళ పల్నాటియుద్ధాలు పాడిపాడి
పల్లెపల్లెను ప్రాణాలు పచ్చగిల్ల
జాతిసుఖము పోషించితి సర్వకాల
మెచ్చట సురింగిపోతివో బిచ్చకాడ?
కవివి పాటకుడవు నీవె గావె సఖుడ!
బువ్వమ్ము బంతులన్‌ కవ్వించి వయసు కావర ముబ్బ పడతులు పాడలేరు
గొబ్బి తట్టెడు వేళ గూడ ప్రాయపుకన్నె లరమర లే కాడ మఱిచినారు
తద్దె పండుగుల సైత ముయాల లూగుట మోటుగా ముగ్ధలు మూసినారు
రుక్మిణి మొదలుగా రుచిగొన్న బొమ్మల పెండ్లిండ్లు బాలలు విడిచినారు
ఏ నిరపరాధ మగు క్రీడ లింతవఱకు
జాతి ముఖ తిలకము లైన చానలందు
పెంచె నానంద సౌందర్య సంచయమును
ఆ శుభము లస్తమించెడి నరయ రేమొ?
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - AchAramu ( telugu andhra )