కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు జన్మభూమి
3. జన్మభూమి
ఏ దేశ మేగినా, ఎందుకాలిడిన,
ఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనిన,
పొగడరా నీతల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమొ,
జనియించినాడ వీ స్వర్గ ఖండమున;
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావొ,
నిను మోచె ఈ తల్లి కనకగర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందు,
లేరురా మనవంటి పౌరు లింకెందు.
సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక,
ఓడల జండాలు ఆడునందాక,
అందాక గల ఈ యనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు;
పాడరా నీ తెన్గు బాల గీతములు
పాడరా నీ వీరభావ భారతము
తమ తపస్సులు ఋషుల్‌ ధారపోయంగ,
శౌర్యహారము రాజచంద్రు లర్పింప,
భావసూత్రము కవిప్రభువు లల్లంగ,
రాగదుగ్ధము భక్తరత్నముల్‌ పిదుక,
దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ,
రాళ్ళ తేనియ లూరు రాగాలు సాగ,
జగముల నూగించు మగతనం బెగయ,
సౌందర్య మెగబోయు సాహిత్య మలర,
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర!
దీపించెనీ పుణ్యదేశంబు పుత్ర!
పొలముల రత్నాలు మొలిచెరా యిచట,
వార్ధిలో ముత్యాలు పండెరా యిచట,
పృథివి దివ్యౌషధుల్‌ పిదికెరా మనకు,
కానల కస్తూరి కాచెరా మనకు,
అవమాన మేలరా! అనుమాన మేల
భారతీయుడనంచు భక్తితోపాడ.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - janmabhUmi ( telugu andhra )