| కవితలు | ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు | కీలకము |
| 11. కీలకము |
|
ఎన్నాళ్ళ కొచ్చావె చిన్నారి చిలక! కన్నారి చూచిన ట్లున్నాది చిలక దానిమ్మ గని నిన్ను తలపోస్తి చిలక లే నిమ్మ దరి కేగలే కొస్తి చిలక! |
|
బింబాల చూచి కంపించానె చిలక తాంబూర శ్రుతికెంతో దడిశానె చిలక వంశకీర్తన విని వణికానె చిలక మదిలోని రొదలకే అదిరానె చిలక! |
|
అద్దాల కెదురుగా అడలానె చిలక చిత్రాలు కనులకున్ చెఱలాయె చిలక వెన్నెల ఱేలకే వెఱచానె చిలక కొమ్మలతో చెల్మి కొలమాయె చిలక! |
|
గువ్వ జంటల చూచి గునిశానె చిలక సందెరాగము గాంచి జంకానె చిలక అడవి పూవులతావి కలిశానె చిలక గందంపు నీడలన్ కాగానె చిలక! |
|
తలయెత్త తారకల్ ఉలికించె చిలక చెవి యొగ్గ కోయిలల్ చెండాడె చిలక పడుచు కోర్కెలులోన ఉడికించె చిలక లజ్జ దాగుడుమూత లాడించె చిలక! |
|
ఉత్తరమ్ము లిఖింప నుంకించి చిలక కలగి వీధులలోన మెలగితిన్ చిలక మొగలి పూబొదలలో మునిగితిన్ చిలక తీయ పొత్తులకునై తిరిగితిన్ చిలక! |
|
నా చేతు లంటి స్విన్నము లయ్యె చిలక చక్కని గేదంగి ఱెక్కలున్ చిలక నా యూర్పులకె వాడి నలుపెక్కె చిలక నవనవలాడు పల్లవపాళి చిలక! |
|
చైతన్య మయమైన జగతిలో చిలక వెదకితిన్ దూతకై విసు వేది చిలక తలలూచె జాలితో తరులెల్ల చిలక సరసులున్ కదలకే దురపిల్లె చిలక! |
|
మెలగడే యక్షుకై మేఘుండు చిలక కదలదే నలునకై కలహంస చిలక కలికి దౌత్యము చేదు కాబోలు చిలక సుదతి ప్రార్థన మెంత చులకనో చిలక! |