| కవితలు | ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు | ప్రబోధము |
| 2. ప్రబోధము |
|
అమరావతీపట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగా పలు శస్త్రశాలలు నిలుపునాడు, విద్యానగర రాజవీధులన్ కవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు, పొట్నూరికి సమీపమున ఆంధ్రసామ్రాజ్య దిగ్జయస్తంభ మెత్తించునాడు, |
|
ఆంధ్రసంతతీ కేమహితాభిమాన దివ్యదీక్షాముఖ స్ఫూర్తి తీవరించె, ఆ మహావేశ మర్థించి యాంధ్రులార! చల్లు డాంధ్ర లోకమున నక్షతలు నేడు. |
|
తనగీతి అరవజాతిని గాయకులనుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి, తనపోటులు విరోధితండంబులకు సహింపనివిగా మెఱసిన తెనుగు కత్తి, తన యందములు ప్రాంతజనుల కభిరుచివాసన నేర్ప నలరిన తెనుగురేఖ, తనవేణికలు వసుంధరను సస్యశ్యామలను జేయ జెలగిన తెనుగు భూమి, |
|
అస్మదార్ద్రమనోవీధి నావహింప జ్ఞప్తి కెలయించుచున్నాడ! చావలేదు చావలే దాంధ్రజనమహోజ్జ్వల చరిత్ర హృదయములు చీల్చి చదువుడో సదయులార! |
|
కృష్ణాతరంగ పంక్తిన్ త్రొక్కి త్రుళ్ళింత నాంధ్రనౌకలు నాట్యమాడునాడు, ఇంటింట దేశిసాహిత్యదీపములతో నాంధ్రతేజస్సు తీపారునాడు, సుకుమార శిల్పవస్తు ప్రపంచమునందు నాంధ్రనైపుణి పంతమాడునాడు, సమద సేనావ్యూహ జయపతాకలక్రింద నాంధ్ర పౌరుషము చెండాడునాడు, |
|
చూచి, సంతోషమున తలలూచి, గర్వ మాచి ఆంధ్ర పుత్రీ పుత్రు లందగలరు శాంతి, నందాక లేదు విశ్రాంతి మనకు; కంకణ విసర్జనల కిది కాల మగునె? |