కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు పుస్తకము
4. పుస్తకము
నిండాఱ బాఱు నఖండగోదావరిన్‌ దాగిన చాళుక్యనాగరికత,
పాడైన పెనుకోటగోడల దీర్ఘనిద్రలు వోవు కాకతి ప్రాభవమ్ము,
పల్లెపదాల జీవము నిల్పికొన్న పల్నాటివీరుల రక్తనాళపటిమ,
కడలేక యేడ్చు తుంగభద్ర కెరటాల మణగిన ప్రాజ్య సామ్రాజ్యభరము,
హృదయములు విన పలుకక చదువు చెప్పు
పుస్తకతపస్విని తెనుంగు పూలపొదల
నిలిచి సేవాశుకమ్ములన్‌ పిలిచి పిలిచి
తిరుగ పాడించు గాత జాతీయగీతి.
ఆచారమునకు దాస్యము చేయుచును వంటయిలు దాటి రాని పూర్ణేందుముఖుల,
ఉదయాస్తమయములు నొడలి చెమ్మటలోడ్చి క్షేత్ర సేవలు చేయు సేద్యగాండ్ర,
బ్రతికినన్నాళ్ళు తీరనికస్తి రెక్కలు విరిచి జీవించెడు పేదజనుల,
తను వచోవీధులన్‌ తాకరా దనుచు దుర్గతుల ద్రోసిన చెప్పరానివాండ్ర,
పూలతో నిండి కమ్మదనాలు చిమ్ము
పుస్తక నికుంజపుంజాళి పొంత బిలిచి
'నా జనము, నాదుదేశ' మనంగ జాలు
ఇంత జ్ఞానభిక్షాదాన మిమ్ము తల్లి!
ఆంధ్రుల శిల్ప విన్యాసంబు చూపించు కలిమి గోపురములన్‌ గల దటంచు,
ఆంధ్రనాగరిక కళ్యాణచిహ్నములైన గానసాహిత్యముల్‌ గల వటంచు
ఆంధ్ర భాగ్యమ్ము మోయగ గౌతమీ కృష్ణ దరులను నావలు తిరిగె ననుచు,
ఆంధ్రవీరులకు స్వర్గాతిథ్యమిచ్చి పాటలు పాడిన యుగమ్ము కల దటంచు,
చెప్పి యొప్పించు పుస్తక శ్రీకుమారి
యందగింపగ గల యాలయములు గట్టు
డాంధ్రదేశమునం దెల్ల నాంధ్రపుత్రు
లాప్తమానవసంఘ సేవానురక్తి.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - pustakamu ( telugu andhra )