కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు తెనుగు మాన్యము
10. తెనుగు మాన్యము
వంశిన్‌ వంచి, మృణాళమున్‌ మెలిచి పక్వద్రాక్షనెండించివా
గంశల్‌ మార్దవమాధురీ సుభగవిన్యాసంబు జిల్కన్‌ దశ
త్రింశల్లక్షజన ప్రసన్నరసనా దేవాలయాభ్యంతర
ప్రాంశుప్రార్థన గీత మైన తెనుగుంబల్కున్‌ ప్రశంసించెదన్‌.
పాల క్రొమ్మీగడల్‌ పచ్చివెన్నయి విచ్చి తీయని నునుపూస లాయెనేమొ?
కమ్మని మకరందకణములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమొ?
పూలలావణ్యంబు పొంగి చక్కదనాల పిందెలై రుచులెక్కి పెరిగెనేమొ?
సెలయేటి యుయ్యాల కులుకుటొయ్యారముల్‌ ముద్దుముచ్చట లయి ముదిరెనేమొ?
పాటకును పద్యమునకు నబ్రముగ నొదిగి
చవికి చాతుర్యమునకు సాజముగ సాగి
పోరునకు పొత్తునకు చాలి పొందిపొసగు
మా తెనుగుతల్లి మెడ కిదే మల్లెదండ.
నన్నయభట్టు భారతమునన్‌ జతియించెను సంస్కృతంబుతో
కొన్ని తెనుంగులేరి తనకూర్పున కొప్పినయంత; కానియా
వన్నిబిడాంధ్రలోకముఖభాషితమై శ్రుతిసేవ్యమాన జీ
వన్నవనీతమౌ తెనుగు పాలసముద్రము పుక్కిలించెనే!
ఈనిన ఆలమందగతి, ఇంపు లిగిర్చి ఫలించినట్టి యు
ద్యానముపోల్కి, సస్యరమ యాడెడి వేదికబోలు నీతెలం
గాణమునం దనంత సుముఖస్వరజీవనమైన శబ్దసం
తానము నేలె తిక్కనవిధాత తెనుంగుల జాతు లేర్పడన్‌.
సంధికి వచ్చి, పంపకపు సంగతి నంతయు గట్టిపెట్టి, ఆ
యంధుని వార్ధకంబె పరిహారము అన్నిటి కంచు జూపి, శాం
తిం ధరియించు టొప్పని ధ్వనించెడి పట్టులగూడ, వైఖరీ
గంధము మోసె తెన్గునుడికారమె తిక్కన సిద్ధవాక్కునన్‌.
తలకొను రాణ్మహేంద్రవర తార్కికులన్‌ పడదిట్ట, నర్మసూ
క్తుల నుసికొట్టుజాణల నెదుర్కొన, హర్షుని ప్రౌఢకన్యకున్‌
తళుకు పసిండికంచ మరణం బిడగా, కవిరాజు పాలిటన్‌
మెలగదె కామధేనువయి నిండు తెనుం గఖిలార్థసాధనన్‌.
భ్రమర పదంబులందు భగవత్ప్రకృతి ప్రణయానురాగ త
త్త్వమును సమన్వయించి పసిపచ్చిక మేయుచు తప్పిపోయు వ
త్సములకు కృష్ణగానమున దారులు సూపి సుధాధునీ తరం
గ మృదుమృదంగభంగి కవికాంతుడు పోతన విన్చె తెన్గునన్‌.
ముగ్గలు నవ్వి పువ్వులగు పోల్కి, ప్రబంధకవాట పంక్తులన్‌
నిగ్గు తెనుంగుతోరణపు నిండుకళల్‌ సొగసార, రంగులన్‌
మ్రగ్గిన చిత్రసౌష్ఠవము, రాగములన్‌ రవళించు హాయియున్‌
బిగ్గ గవుంగలింప దొకొ పెద్దన భవ్యశిరీష భారతిన్‌.
త్రిభువన సుందరీ కుల కిరీటము సత్య; తదీయ గర్వ సౌ
రభము, పరాభవజ్వరభరంబును, వాసెన కట్టుచీర, కో
ప భవనవాసమున్‌, కటికిపానుపు, గృష్ణునిరాక, ధూర్త వా
గభినయలక్షణంబు లలరారవె తిమ్మన ముద్దు తెన్గులన్‌.
పొలమును సాగదున్ని, పసిమొక్కలు నాటి, ఝరీపయస్సులన్‌
మెలపుగ ద్రిప్పి, పెంపుగమనించి, సుపర్వవిపాకమందుగో
సి, లలితపుం బరంజముల చిక్కనిపాలను కాచి, శర్కరో
పలములు పంచె నీ తెనుగు వాకిట సూరనకావ్యపుత్రికల్‌.
తంబురతీవెలన్‌ తొణకుతానము, పల్లకి పల్లవించురా
గంబులు, పిల్ల వేణువుముఖంబున గుల్కు సుఖస్వరాళి, యే
కం బయిన ట్లొయారి నడకన్‌ బహుళాభరణాళియాడి పా
డం బయకారి తెన్గురవలన్‌ జనకట్టడె భట్టుమూర్తియున్‌.
సరళపదాల భావమయసాహితి నేలిరి సత్కవీశ్వరుల్‌
స్వరమయరాగకీర్తనల స్థాయిసుఖం బెలయించె నాద త
త్పరు డయి త్యాగరాజు, భగవత్కళ దిద్దిరి రంగురేకలన్‌
నిరుపమ సిద్ధహస్తులగు నేర్పరి శిల్పు లజంత లోయలన్‌.
పరిణత వాక్కు లస్మదనవద్యకలా కవితా పితామహుల్‌
స్థిరముగ నిచ్చిరీ తెనుగ దీయని మాన్యము, నిందునూత్నవ
ల్లరులను, కొత్తయంట్లను, ఫలద్రుమజాతులనాటి పెంతుసం
బరమున నేవనప్రియలు మంచెలపై నెలుగెత్తి పాడగాన్‌.
అందదు నిర్వికారము నిరంజనమౌ పరతత్త్వ రేఖ ఆ
నందమె నిర్గుణానసగుణానను ప్రాప్యమయౌట, మాతృమూ
ర్తిం దరిశింతు నీ ప్రకృతి దివ్య శుభావరణాన, తత్పయో
బిందువు లాను బిడ్డవలె వింత స్వతంత్రముతో నహర్నిశల్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - tenugu maanyamu ( telugu andhra )