కవితలు ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు తెనుగుతల్లి
8. తెనుగుతల్లి
శ్రీకాకుళస్వామి సిగపై సువాసించె తెల్లని ఆంధ్రుల మల్లెపూలు
ఒడ్డెరాజుల జీవగడ్డ గ్రక్కదలంగ కోరాడె మత్తాంధ్రకుంజరములు
చీకటి మన్నెముల్‌ ఛేదించి నవధాన్యముల నెత్తె ఆంధ్రుల పోపుటెడ్లు
చిలుక సరస్సులో శృంగారనౌకల నడిపె ఆంధ్రుల యింటి పడుచుజతలు.
ఉత్కలాశానితంబమ్ము లొత్తి హత్తె
ఆంధ్రుల యశోదుకూల సితాంచలములు
తమ్ముడా! మాయనిత్తువే తల్లివన్నె?
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?
నాగార్జునాద్రి కంఠముల గండూషించె పలు భాష్యబంధమై తెలుగుశిక్ష
ప్రాకృతాశ్రమ వాటికాకులమ్ముల నాటె తీయమామిడి యంట్లు తెనుగు కవిత
బౌద్ధ ధర్మ రహస్య భావముల్‌ పరమ తాత్త్వికదృష్టి విడదీసె తెనుగు ప్రతిభ
కొండలోయలలోన కోమలలావణ్య మలరార చిత్రించె తెనుగు కుంచె,
గంగ తలనుండి కావేరీ కాళ్ళదాక
వెలిగె దిఙ్మోహనమ్ముగా తెలుగుఠీవి
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?
పంజాబునుండి కప్రపు మొక్కలను దెచ్చి పెరటి తోటలలోన పెంచినారు
పచ్చి జవ్వాజి గోవానుండి రప్పించి దంతంపు జాడీల దాచినారు
కొండవీటి గులాబి గుత్తుల అత్తర్లు కీలు తిత్తులలో బిగించినారు
అసలైన పారసీకాశ్వాల నలవార్చి విజయయాత్రల స్వారి వెడలినారు
సాంగజీవిత కల్యాణ శాఖ క్రింద
నిలిచి ఆనందదేవతన్‌ గొలిచినారు
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?
మోటుపల్లీ తీరమున లంగరేసి ఓడలు సుంక మర్పింప నిలుచునాడు
రాయలసీమ రా రాయబార్లు వసించి చిత్ర చరిత్రల్‌ రచించునాడు
పాకాల చెరువు చెంపల పండు ధాన్యముల్‌ అన్యదేశాధీశు లడుగునాడు
అద్దంకి కోడెల నాబోతులకు నయి దూరాగతులు కొని త్రోలునాడు
ఖండ ఖండాతరములన్‌ ప్రకాశమయ్యె
తెనుగుతల్లి లాలాటికా తిలకదీప్తి
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?
నందనోద్యాన సౌందర్యమ్ము నెగబోయు గోదావరి ముఖాన కోనసీమ
సుఫల సంపత్సస్య సురభియై మెఱయు కృష్ణా రసశ్యామ గుంటూరు సీమ
ధవుని పోరి కదల్చి కవిని నేరిమి గెల్చి మీరిన జాణ నెల్లూరి సీమ
ఆంధ్రదిగ్జయ పతాకాలంకృతమ్మైన రతనాలయంగడి రాయసీమ
నేల నాలుగు చెఱుగుల నిగ్గుదేలె
రాణ సూయాణమై తెలంగాణరేఖ
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhrAvaLi prabOdhamu - tenugutalli ( telugu andhra )