| కవితలు | ఆంధ్రపౌరుషము - విశ్వనాథ సత్యనారాయణ |
| శా. |
శ్రీపద్మాకర చామరానిల హృతస్వేదాంబువౌ మేన ది వ్యాపాంగమ్ముల నీవు లోకముల బ్రోవన్ వీణ వాయించుచో నీపారామ నిరంతరధ్వనిత తంత్రీనాదసంతాన మ మ్మా! పల్కించగదమ్మ! విశ్వజగదంబా! రాజరాజేశ్వరీ! |
1 |
| సీ. |
ఒకనాఁడు గలదాంధ్ర యువకులు తూరుపు-కనుమదుర్గముల నేలిన దినంబు ఒకనాఁడు గలదు శిల్పకళాసరస్వతి-అమరావతిని నృత్యమాడు దినము ఒకనాఁడు గలదాంధ్ర సకల ప్రపంచమ్ము-కృష్ణాస్రవంతి నూగిన దినంబు ఒకనాఁడు గలదు నిల్వకపాఱు శత్రుల-నాంధ్ర సైన్యంబు వేటాడు దినము ఒక్కనా డున్నయది యాంధ్ర యుద్ధభూమి-కత్తివాడికి రిపుల రక్తంబు నదులు కట్టినదినంబు నేటికిఁ గాలవశత-నస్మదున్నతి తలక్రిందు లయ్యెగాని. |
2 |
| ఉ. |
కాలముమారి యోడలను కట్టిరి బండ్లకుపైన సింహశా ర్దూలములున్ సృగాలములతో సరిరావు నిరంతరాంబుధా రా లసితంబులౌ నదులు రమ్యతదక్కి మహాతపాగ్నికిన్ గాలువలయ్యె మమ్మెటులఁ గాచెదొ నీవిక నాంధ్రమాతృకా! |
3 |
| మ. |
మును పంబారులమీదనే తిరిగి తంభోరాశి బంధించి తా గినవా రెవ్వరు తల్లి! నీయెదుర మూకీభూతులై శాత్రవుల్ చనినా రేగిరి గహ్వరంబుల నివాసంబుం బొనర్పంగ నీ తనయుల్ నీతనయుల్ రిపూత్కరము సాధింపంగ నాంధ్రావనీ. |
4 |
| గీ. |
దివ్యవాహిని కృష్ణానదీ స్రవంతి మోహననినాదగానమ్ము మురువుతఱిగె తన్మనోహర గానగీతమ్ము మరల బాడగావలె మృదువుగాఁ బ్రకృతిమాత. |
5 |
| మ. |
తెలుగుంజాతికిఁ బౌరుషంబుగల దద్రిస్వామికన్యాకృపా ననలంబుంగల దీదృశంబుగ మహాకష్టంబు లీనాటికిం గలిగెంగాని కుఠారకృత్తరిపురాట్కంఠ స్రుతాసృఙ్నదీ జలసంసిక్త జయేందిరాస్యము మహాశౌర్యంబు సామాన్యమే? |
6 |
| శా. |
ఏమూలం జని డాగెనో తెలియవయ్యెన్ గ్రోధవిస్ఫారిత భ్రూమధ్యంబున మండు మంటలను నీరుంబోలె పాశ్చాత్య సం గ్రామంపుం దెలివెల్లతేర్చిన మహోగ్రంబైన సత్పౌరుష ప్రా మాణ్యంబగు మాదు వెల్మదొరలాంధ్రస్ఫీత శౌర్యోన్నతుల్. |
7 |
| మ. |
మును కృష్ణాతటినీజలాంతరమునన్ బొంగెత్తి యుద్భూతమై ననతేనెల్ స్రవియింప మ్రోగిన సుధానాదంబు కార్యంబునం దినదేలో, దెసలన్నియున్ జివురులెత్తెన్ మున్నుతద్రావమున్ విని యీనా డవి వాడి శోకభర మూనెన్ కాంతిదూరమ్ముగా. |
8 |
| సీ. |
రుద్రుడైన ప్రతాపరుద్రదేవుం డోరు-గల్కోట బురుజుపై కాలుమోప విద్యానగర రాజవీధి పట్టపుటేన్గు-పైఁ గృష్ణరాయలు పాఱఁజూడ పిడుగు మొత్తము బొబ్బిలికోటపుండరీ-కము పాపరాయడు కన్నులురుమ చాళుక్య రాట్ప్రతిష్ఠా కీర్తిచోళనా-యకకీర్తితోడ నెయ్యమ్ము నెఱప పూర్వసంపదలను కాలిబొటనవ్రేల-నలుపు శౌర్యమ్ము లేమూల నక్కెనొక్కొ? పాడుదౌర్భాగ్యవిధి నిలింపస్రవంతి-నెండఁగట్టెడు కాలమ్ము నెఱిగెగాక. |
9 |
| సీ. |
ఆంధ్రభూధవుల కార్యాలయాంతఃపుర-ప్రతతి కోతులకు నావాసమయ్యె రాజకిరీట రారాజన్మణిచ్ఛటల్-ప్రతిఫలించెడు చోట్లు పాడువడియె పట్టపేనుగులు గర్వసమేతముగ నేగు-కడల జిల్లేడుమొక్కలు జనించె ఆంధ్రపౌరుష మాటలాడుచోటులు శిలా-దృతిని మార్గము నిరోధించి నిలిచె ఆంధ్రతేజమ్ముగని మోదమంది నట్టి-యాకసముగూడ మాలిన్యమై చెలంగె కాలమా! నీకృతమ్ములు గలవుగద శ-తమ్ములున్ వేలు నేమి ఫలమ్ము చెప్పి. |
10 |
| శా. |
ఆపద్మాలయ సత్కృపాగరిమమౌరా! యెంత తచ్ఛౌర్య రే ఖాపాండిత్య మయారె! యెంత! యిపు డొక్కండైన నూహించి సం తాపం బందునె యేమి పట్టినది, నేత్రంబుల్ సబాష్పంబులై తాపంబందె మనంబు కంఠమతి రుద్ధంబయ్యె నూహించినన్. |
11 |
| ఉ. |
ఆగిరిదుర్గముల్ ప్రకృతమం దెటులున్నవొ చూచి, పూర్వపుం భోగము లూహచేసి కనుపొంతల జాఱెడు బాష్పనీరముల్ చేగిలిగించి యెవ్వడు కృశింపడు వాని నరంబులందు శౌ ర్యాగమవేత్తలైన మన యాంధ్రుల రక్తమె పాఱుచుండినన్. |
12 |
| గీ. |
పోయినది, యాసకుం దాటిపోయినది యిఁ కెన్నొ దీర్ఘవర్షములు గతించినవి పు రాప్రధితులైన మారెడ్డిరాజుల సిరి యున్నయిది చూచి శాత్రవుఁ డోర్వలేడు. |
13 |
| సీ. |
కోటగోడలనుండి కుప్పించి సింహంబు-లోయన నరులపై నురకలేదొ కొండయడుగునుండి కొండపైవరకు నూ-గించి తేజీల దూకించలేదొ కోతతల్పులను డీకొనవచ్చు కుంభికుం-భమ్ముల గ్రుద్ది చంపంగలేదొ వేనకువేల్ శత్రువీరులమధ్య లం-ఘించి వారలను హరించలేదొ ఆంధ్రవీరులు, వారి శౌర్యంబునెన్న-నేటికది మాయెడన్ స్మరణీయమయ్యె ఆహవక్షోణియందు మా యాంధ్రవీరు-లెంతలెంతలు చేసిరో యెవ్వ డెఱుగు? |
14 |
| సీ. |
కాపువీరులు ఘోటి కదలించి కృష్ణపా-యలు చంగుచంగున నవతరింప రెడ్డిరాజులు సమాకృష్యమాణ భ్రూల-తాదీప్తి పరరాజ ధైర్యమడప కమ్మశూరులు చేతికరవాలము విదల్చి-దిగ్వితానముల దీధితులు నెఱప ఆంధ్రనియోగివంశార్ణవోద్భవమణుల్-కత్తిగంటముల నైక్యంబుసేయ వైదికులు మత్తమధుకరఫణితిమ్రోయు-వేదరవముల దెసల పుష్పింపజేయ నొక్కయప్పుడు మా యాంధ్రు లుండిరనెడు-జ్ఞానమొక్కండది మనఃప్రశాంతి నాకు. |
15 |
| సీ. |
మతికబ్రమగు తృణీకృత దేవగురుమతి-ప్రతిమానదుర్గనిర్మాణ శక్తి ఆశ్చర్యమగు ధ్వంసమైనప్పటికి నిప్ప-టికి చిహ్నలున్న శిల్పకళ సొగసు అంతంతఱాళ్లెట్టు లాపైకి నెత్తిరో-దేవతలో యేమొ తెలియరాదు చూచినంజాలు నచ్చోటి సరోవరం-బులు లోతు నేటికి తెలియరాదు ఆబలమ్ము, నాపనినేర్పు, నావిలాస,-మెంత యున్నదొ మును చూచునంత నోము నోచుకొనలేకపోతి మయ్యో చివరకు-నేటికాచోట్లనైన జన్మించలేదు. |
16 |
| సీ. |
కోపమెత్తిన రక్తకొల్లయ్యె విజయరా-మావనీధవుని వక్షోంతరమ్ము భ్రూభంగ మొనరింప బొగ్గువోలిక నల్ల-నైపోయె ముగురురాయల యశమ్ము తరవారి చేఁబూనువరకె హస్తిపురంబు-కోటగోడలు మ్లేచ్ఛఘోటిదూఱె ఆంధ్రచళుక్యవంశార్ణవం బనినంత-గంగాప్రవాహ ముప్పొంగిపోయె సై యనినయంతలోన నీజిప్తునుండి-తెలుగుదేశమ్మువరకు కాన్కలు స్రవించె ఆంధ్రపౌరుషమన మాటలా! రిపూత్క-రముల గుండెలు వినినంత బ్రద్దలయ్యె. |
17 |
| సీ. |
మఱచిరా! సకల దిఙ్మండలేశ్వరులు కృ-ష్ణారాయపతి కప్పనంబు లిడుట తలపరా! యోర్గల్ప్రతాపరుద్రుని భుజా-స్థితి ధరాసతి సుఖాసీన యగుట స్మరియింపరా! రణస్థలి పరాభూతులై-ఆంధ్రశత్రువులు వేటాడబడుట ఎఱుగరా! ఆంధ్రభూధర శిఖాగ్రముల నాం-ధ్రప్రతా పరధైర్య మపహరించు టంతలోనె విస్మృతిగల్గెనా! తెలుంగు-జాతి జాతీయగీతికాజనిత దివ్య మధురమధురససంపూర్ణ మంజులార-వప్రభూత సమ్మోహన ప్రధితకీర్తి. |
18 |
| సీ. |
ఏమాయె! నొరుగల్లు నేడుకోటలు నాంధ్ర-పృధ్వీపతీపురంధ్రి కళమాసె మ్రోయదేలా! విశ్వమోహనగీతి వి-ద్యాపురీవరము రోదోఽంతరమున కొండవీడున మాయగోపాలుగానమ్ము-ప్రణయగీతికలు నిప్పటికిఁ బర్వె అతిధుల రండురండను పిల్పు వినరాదు-కొండపల్లిపురంబు కోటముందు తెలుగు విద్యార్థు లమరావతీపురంబు-విమలకృష్ణానదీసైకతములయందు సాంధ్యకాలమ్ములను శిల్పశాస్త్రగోష్ఠి-సేయమానిరికాబోలునోయి మున్నె. |
19 |
| సీ. |
సకలజగద్రక్షఁ జన మూడుపుడిసిళ్ళె-పూరింపలేడాయె వారిరాశి వంచినతల నింతవరకెత్తగా గుండె-యానదు వింధ్యనగాధిపతికి ఆంధ్రుల పసిపిల్ల లందఱి కడుపులో-తవరజీర్ణించు వాతాపినేడు 'సర్పసర్ప' యనంగ 'సరోభవ' యటన్న-తరుగయ్యె నుపపురందరహఠమ్ము పూర్వమునఁ దొల్త నాంధ్రుల బొమలు ముడులు-వడినయంతన లోకముల్ జడతనొందె అమిత కరుణాప్రదీప్తి విప్పారినంత -ఎల్లలోకమ్ములకు సంఘటిల్లె శాంతి. |
20 |
| మ. |
అతడే కుంభభవుండు మౌనివి మతాహుంకార పృధ్వీధరో ద్ధతి వజ్రాయుధ సన్నిభుండు ప్రథమాంధ్రస్వామి యావీరునిన్ మతినూహించి యొకింత యాంధ్రులన నేమాత్రంపువారో తలం చితిమేన్ బ్రస్తుత నీచభావములు రాశీ భూతమై మ్రగ్గెడున్. |
21 |
| క. |
తొలికవి మా యాంధ్రక్ష్మా తలమందున బుట్టినతడె తద్వరవక్త్రో జ్వల దివ్యమధునదంబున జలజాప్తకులంబు పూతసరణి వహించెన్. |
22 |
| ఉ. |
అంతటివారలంట ప్రథమాంధ్రులు నాపయి వారి రాజ్యవి శ్రాంతికి నాలు మూడు జలరాసులగున్ బొలిమేర లాధరా కాంతులకీర్తికన్యకలు కట్టినమేఖలలయ్యె భూధర ప్రాంతవిలాసదుర్గములు ప్రస్తుతమందున కాంతిమాసినన్. |
23 |
| గీ. |
అట్టిరాజ్యమ్ము సంపద యట్టిదెల్ల ఆత్మవిజ్ఞాన మలవడనట్టివారి కంబుజాక్షుని లోకమ్మునట్లు మూఢ చిత్తులముగాన మాకు నశించిపోయె. |
24 |
| సీ. |
రాజ్యాంగతంత్ర నిర్మాణ కౌశలులకు-జంకదస్త్రముల నాశలు జనించె పరరాజ రక్తప్రవాహమజ్జనులకు-గత్తిగన్గొన భయమెత్తిపోయె సింహాసనముల నాసీనులౌవారికి-నితరదాస్యపురుచి హెచ్చిపోయె ఆధ్యాత్మదివ్యవిద్యావేత్తలకును దే-హమున నంతంతకు మమతగలిగె పెద్దపులి పిల్లియయ్యెను పిల్లి పెద్ద-పులివిధమ్మున విక్రమమ్మును వహింప మండువేసగియెండల కెండిపోయె-దివ్యవాహిని కృష్ణానదీస్రవంతి. |
25 |
| సీ. |
మోసెత్తి చిన్నారి మొలకయై బాలద-ళాకారమై పసియాకు విడిచి దినమొక్కచాయదేరి నిరంతరాంబుధా-రాపోష్యమగుచు సారంబువడసి అల్లనల్లన ప్రాకులాడి ఱెమ్మలువేసి-నల్గడల్ వ్యాపించి నలుపు తిరిగి చిగిరించి కొంగ్రొత్త లిగురెత్తి గొనబొత్తు-పులకరించిన రాలు పూతపూచి అంతఁ జంద్రికాధావళ్య మనుకరించు-సూనసంతానములు దిగ్వితానములను పూచి దెసలందు సౌందర్యమును ఘటించె-ధరణి నాంధ్రయశోలతాంకురము పొలిచి. |
26 |
| సీ. |
రోమీయులైన వీరులు రెండు కెలకుల-రమ్యమౌ వింజామరలను వీవ సకలదేశాగతక్ష్మాతలేంద్రులు పద-మ్ముల తలల్ మోపి కాన్కల నొసంగ తన పేరు విని రిపూత్కరముల శిశువులు-భూధరాంతరముల పోరువెట్ట తనవిలోచన కృపాంబునిధానములగోరి-యఖిలదేవతలు నందంద నిలువ దక్షిణపదంబునన్ బద్మదళమునందు-కనకసింహాసనంబునఁ గాలుమోపి రాచకార్యంబుల పరీక్ష నాచరించె-రమ్యమోహనాకృతి నాంధ్రరాజ్యలక్ష్మి. |
27 |
| సీ. |
ఆటపట్టులు నాగులేటిపాములు తూర్పు-వెలిబార పడగలు విప్పుచోట్లు భోజనమ్ముల రాళ్లపోరాటమునకైన-సాహసింపగచేయు శక్తిదములు పౌరుషమ్ములు క్రుధాభరితలోచనరాగ-దళితారిసైన్యసంతానములును అభిమానములు చంద్రికామృతప్రతిమాన-భవ్యాంధ్రకీర్తి నిర్వాహకములు ఈవిధమ్ముగ పొలిచి యహీనమైన-ఖడ్గమును బూని ఘోరసంగ్రామ భూమి వృషభవాహనములమీద నెక్కి నటన-సల్పినది యాంధ్ర పల్నాటి శౌర్యలక్ష్మి. |
28 |
| సీ. |
గోదావరీ పావనోదకంబుల తరం-గాలపై నౌక లుయ్యాలలూచి అరికంఠరక్తచిహ్నములు పోవుటకునై-పెన్నానదిని కత్తిపొన్ను కడగి అరినిషూదనకార్యమందు గల్గిన తాప-మడపఁ గృష్ణాపగయందు మునిగి తుంగభద్రాసముత్తుంగరావము రిపు-శ్రీభేదకముగ ఘోషింపజేసి మాటిమాటికి దెసలెల్ల మాఱుమ్రోగ-గడగడవడంకి దిక్కు లుగ్రతఁ జలింప శత్రుల హృదంతరమ్ములు సంచలింప-విశ్వమునదించె నాంధ్రుల విజయభేరి. |
29 |
| సీ. |
ఆంధ్రదేశస్థ సర్వాపగా భంగత-రంగరంగముల శౌర్యములు నేర్చి ఆత్మప్రతాప శౌర్యములు తాలిచి, 'సుమి-త్రా బోర్నియో' ద్వీపతతులు గెలిచి వంగమహారాష్ట్రవార్థులు పరిచయ-స్థలములై వినయమ్ము సలుప మెలగి ఈజిప్తునుండి కృష్ణాజలమ్ములకు 'బారం-బాటగా' పరాక్రమము జూపి సకలదీవుల విజయధ్వజములు నాటి-తనదు తెరచాప వార్ధిరాజునకు కట్టు కోకగాఁ బూర్వ మాంధ్రుల నౌకరాజ్య-మమరజేసిన దేడుసంద్రములమీద. |
30 |
| శా. |
ఆ శౌర్యమ్ములు నాప్రతాపములు దౌష్ట్యంబేచుకాలంబుచే మాసెన్ సర్వజగమ్ము లేలగల సామర్థ్యమ్ము బందీకృత మ్మై శోభాగళితంబునై మెలగె కట్టా! యాంధ్రలోకమ్ము స ర్వాశాజైతృకతావిచారములు దాస్య ప్రాప్తి చేకూర్చెనే. |
31 |
| శా. |
ఏదేవీపిత యౌటచే హిమధరాభృత్స్వామి కొండంత స మ్మోదంబందెనొ రాజమౌళి తనకున్ ముద్దారు నల్లుండుగాన్ ఆదేవీ కరుణాంబుధారలకు నిల్లౌ మాయశోగీతికా నాదం బీదృశఫక్కి కార్శ్యమును నందన్ గారణంబేమొకో. |
32 |
| ఉ. |
కన్నులనీరు వచ్చిననుగాని హృదంతర మగ్నిసన్నిధిన్ వెన్నవిధానగాగ విలపించినగాని తలంచ లాభ మే మున్నది యెన్నినాళ్ళయినదో మన కృష్ణయు తుంగభద్రయున్ బెన్నయు గౌతమీనదియు విశ్వము మ్రోగనదించి యక్కటా. |
33 |
| గీ. |
పైనియాకులు క్రిందకు పైకి క్రింది యాకు లీరీతి నిముసమ్ము నాగకుండ కదలుచున్నది కాలచక్రమ్ము దాని నాపగలవా డెవండులే డవనియందు. |
34 |
| సీ. |
ఏనాటిమాటలో భూనాధవంశ దీ-పాయితుండైన కృష్ణావనీంద్రు డెప్పుడున్నాడొ పృధ్వీశరత్నంబు కా-కతి వంశవీరు డున్నతగుణుండు ఏమయిరో రెడ్డిభూమీధవులు వారి-యౌదార్యమెల్ల యేమీద చనెనొ ఎన్నాళులైనట్టు లున్నది బొబ్బిలి-వీరకోటులు స్వర్గవీధికేగి ప్రాణులకు నెల్ల నెప్పటికైనఁగాని-యవి జరామరణంబు లున్నవియె నిజము దానికేమి నాశములేని తత్వశిల్ప-కవిత లేమాయెనో యెరుంగంగరాదు. |
35 |
| శా. |
అంతర్వైరము లుద్భవిల్లినవి యైక్యమ్మంతమున్ బొందె నొ క్కిం తేమూలను డాగియున్నదియొ కానీ! జాతిశిల్పమ్ము వే దాంతమ్మున్ గవనమ్ము తత్వము సమస్తంబున్ నశించెన్ వృధా భ్రాంతిన్ సర్వము నేటఁ గల్పుకొని రాంధ్రస్వాము లీరీతిగాన్. |
36 |
| గీ. |
నేటి యాంధ్రులు గుడ్డకుఁ గూటి కున్న చాలుననువారలైనారు చచ్చిపోయె నేమొ జాతీయసత్వమ్ము కోమలంబు మల్లికకు నీరులేకున్న మాడిపోదె. |
37 |
| గీ. |
మూడుమూర్తుల తత్వముల్ మొనసి బ్రహ్మ మందు చివరకుఁ జని లీనమైనయట్లు ఆంధ్రశిల్పకవిత్వ తత్వార్థములును ప్రకృతి పురుషుల లీలలోఁ బ్రతిఫలించు. |
38 |
| చ. |
ఇది యెఱుగంగరాక పరులెల్లరు నాంధ్రకవిత్వ శిల్పసం పదన పసందు గానరనువారల మాటల నాలకించి వా రి దయకు పాత్రులై కలవరించుచు వారలు కూయు కూత లి య్యదనునయందు వీరులగునాంధ్రులు కానరు జాతితత్వమున్. |
39 |
| సీ. |
గోదావరీ పావనోదారవాః పూర-మఖిల భారతము మాదన్ననాడు తుంగభద్రాసముత్తుంగరావముతోడ-కవుల గానము శ్రుతిఁ గలయునాడు పెన్నానదీసముత్పన్న కైరవదళ-శ్రేణిలో తెన్గు వాసించునాడు కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ-శిల్పమ్ము తొలిపూజ సేయునాడు అక్షరజ్ఞాన మెఱుగదో యాంధ్రజాతి-విమలకృష్ణానదీ సైకతములయందు కోకిలపుంబాట పిచ్చుకగూండ్లుకట్టి-నేర్పుకొన్నది పూర్ణిమానిశలయందు. |
40 |
| సీ. |
కృష్ణానదీ రవామృతమన్న మనసయ్యె-విమల కాళిందిపై వెగటుబుట్టి భూప్రజాపాలనంబునఁ గోర్కి హెచ్చయ్యె-గోపాల కతయన్న కొంకుగలిగి ఏకపత్నీవ్రతంబే మంచిదనిపించె-కన్యాళిపై విరాగమ్ము గలిగి సకల భూవలయరక్షా కార్య మనువయ్యె-భూభరమ్ము హరించు బుద్ధి తిరిగి రమ్యమౌ నాంధ్రభూమి సారంబుగలది-బృందమున కన్నయని మది నెంచినాడు సుందరమ్మగురీతి రాత్రిందినములు-పాటపాడెను బాలగోపాలమౌళి. |
41 |
| గీ. |
ఆంధ్రవీరుడు క్రోధరక్తాక్షు డగుచు నొరవెరికికత్తి ఝళిపించి యుఱికినాడు నిఖిల దుష్టారికంఠశోణితముబర్వి శాంతి సమకూరినది ధాత్రిజనులకెల్ల. |
42 |
| సీ. |
నునుతమ్మిఱేకు విచ్చినయంతలో బాష్ప-మోడ్చనేమిటికి నీలోత్పలమ్ము మల్లెతీవియఱేకు మడచి మొగ్గ ధరింప-మాడనేమిటికి చామంతిమొక్క పసిపిందవిడచి క్రొమ్మిసిమి తాల్చిన నింబ-మగుడనేమిటికి క్రొమ్మావికాపు అమృతమానిన బలాకము చూలు వహియింప-పికకన్యకకు గొంతు బిగియనేల? ఉత్తమకులంబువార లిట్లూహచేయ-నీచకులములమాట గణింపనేల? ఆంధ్రులయశంబు దశదిశావ్యాప్తమైన-కుటిలభూపాలురకు గన్ను కుట్టిపోయె. |
43 |
| మ. |
తలిరాకుఁగొన బొత్తుకొన్నది మృదుత్వంబేది శ్రీహీనమై ఫలితంబై కనుపట్టె దానికి సమీపంబందునన్ బూచి తే నెలు జార్పంగలయట్టి క్రొన్ననయుఁ గాంతింబాయు పుష్పంధయో జ్వలనాదామృతధార లేటికొ స్రవింపన్ రావ యాచెంగటన్. |
44 |
| సీ. |
ఇవి నందనోద్యాన నవకల్పశాఖులా!-గోచర్మములు కప్పుకొన్నవేల? ఇవి గాంగనవఝరీ భవతరంగమ్ములా!-పొలసుచేపలకంపు బలిసెనేల? ఇవి నిరంతముజేయు శివపూజతావులా!-నెత్రుమాంసమ్ములు నిండెనేల? ఇవి యాగ కార్యోచితేరితఋక్కులా!-సద్విజద్వేషమ్ము సలుపునేల? హరికృపాదృష్టిచే నక్షయాంబరములు-పొందిన పతివ్రతల జన్మభూములటవె? యివి యిదేమి విరుద్ధ మిందేమి? కడు న-పాంసులామానభంగరావమ్ము లేమి? |
45 |
| చ. |
శివసితలింగమూర్తి కభిషేకముజేయు ననంతరంబునన్ బువులను బూజసేయు తలపుల్ చివురెత్తగ నందనంబునన్ దవిలిచరించు నాకవనితామణు లందఱు నింపుకొన్న క్రొం బువులయొడుల్ విభీతలయిపోయి తమంతననజార్చి రేలొకో? |
46 |
| సీ. |
విప్రసంతతిమ్రోయు వేదరావము లలో-దొరలెనెమో యపస్వర మొకండు అనరాదు లోపమేదైనఁ గల్గినదేమొ-పరమపతివ్రతాతరుణులందు నిరతాగ్నిహోత్రముల్ నెఱపు బ్రాహ్మణకర్మ-సంతతిసుష్ఠుగా జరుపబడదొ అఖిలపురాణ శాస్త్రాగమార్ధంబులు-తప్పుచెప్పిరొ యేమొ తత్వవిదులు ఆంధ్రవిష్ణువు శ్రీకాకుళాధినేత-కనులు కొలకులు కెంపుల గనులుగనెనొ ఏకతమొ యుండగావలెకాక యున్న-తెనుగు చురకత్తిపదునుకు తిరుగులేదు. |
47 |
| సంపూర్ణము. | ||