కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
3. ఏ గంటకు?
 
ఏ గంటకు రమ్మంటవె కన్నెలేడి?
  ను
వ్వేడ కాచుకోనుంటవె వన్నెలాడి?
పుగతోటకు నీళ్లుపెట్టి,
బుగతగారి నేమరించి,
కోరుకొన్న మొగలిపొత్తి
కొండకోన వెతికితెచ్చి,
అలసట తీరేతలికే
అద్దరేత్తి రవుతాది-
  ఏగంటకు...
చీకట్లో నీ అందము
చిక్కువిడదు నా కంటికి;
వెన్నెలలో నీ రూపము
కన్ను చెదరగొడతాది;
చీకటి వెలుగుల సందున
చేరరావె చిన్నారీ-
  ఏగంటకు...
మోటసరుకు తోటగాలి
కాటేస్తే కసిరి కసిరి,
నిమ్మతోట పరువానికి
నిలవలేక నిలవలేక,
నలుగుడుపడివస్తె ను
వ్వలిగిరాకు ఆగిపోకు-
  ఏగంటకు...
చిలిపితనానికి పేరు
చెల్లెమ్మకు దొరికేవు;
గుంటల కోనేటిమీద
గొబ్బెమ్మలు నిలిపింది;
అడుగుపడిందంటె చాలు
ఆనవాలు పట్టేస్తది-
  ఏగంటకు...
సోగకనుల్‌ పట్టలేను
తీగమల్లెకడ వొద్దు;
కలిసిపోవు నీ బుగ్గలు
గులాబంట్ల వెనకొద్దు;
పువులపొంత పొదలచెంత
పొంచుని నను వంచింపకు
  ఏగంటకు...
పొడుపు కతల తమ్మయ్యకు
పొద్దోయిందని వూది,
ఊసులాడు నేస్తాలకు
'ఊ'కొట్లతో సరిపెట్టి,
కునికే చుక్కల వెలుగున
గుట్టుచప్పుడుగ రా సుమి
  ఏగంటకు...
AndhraBharati AMdhra bhArati - kavitalu - ee gaMTaku? - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )