| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 7. ఏరుదాటిస్తా | |
| ఏరు దాటిస్తానె చిన్నదానా నా కేమిస్తువె సాహసమున్నదానా? కోయని ఒక పిలుపేనా, తీయని ఒక పలుకేనా ౘాలునులే నేటి కంత ౘనుమానము లిస్తివంటె | |
| ఏరుదాటి... | |
| ఒరిగెనులే సంౙప్రొద్దు; వరదహోరు భయమువద్దు; సూపుమేర దూరములో ఆపడ రెవ రిద్దరమే- | |
| ఏరుదాటి... | |
| బల్లకట్టు మూసిపెట్టి పడకేసిండులె సరంగు; అవునను మొకసిటికలోన అద్దరి జేరుస్తానిక- | |
| ఏరుదాటి... | |
| తుళ్ళింతల యేటి నీటి తుంపరైన సోకనివను; సెదరనీను కవుగిట నీ సిగపూ గమగమలైనా | |
| ఏరుదాటి... | |
| కోరడి మలుపున లేడూ కూచున్నా తోటమాలి ఎల్లేసిన మైలురాయి! ఎందుకె నీకంత బెదురు? | |
| ఏరుదాటి... | |
| చిరునవ్వులు చెదరకుండ సిగ్గుపొరలు చీలకుండ తేలికముద్దొకటీవే వాలుకనుల వగలాడీ! | |
| ఏరుదాటి... | |
| మాటిస్తా నీ సారికి మారాములు సేయనులే; ఒంటరి నీ మనసుగుట్టు ఊరక మోగిస్తునంతె | |
| ఏరుదాటి... | |