| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 16. ఊహపై ఊహ | |
| కోడలుపిల్ల: | ఏడకెళ్ళినగాని ఆడకే నీడల్లె ఎంట బడతాడమ్మ కొంటె శెందురుడు ఒంటిగా విడకోయి, ౙంట బాయకుమోయి, కంటిలో పాపల్లె కాచుకో మామా! |
| బంగారిమామ: | మావితోటకాడ, మర్రివూడలనీడ ఆనాటి మనమాట - ఆ తేనె పాట చిన్ని చిగురాకులలొ చెవ్వొగ్గి విన్నాడొ ఎగలే మీతనితొ జాగరతె పిల్లా |
| కోడలుపిల్ల: | లేత చెంగలిగడ్డి పోతబోసినచోట పంటకాలవయెంట పలుకాడుతుంటే, కాలవాగిందేటొ గట్టు కదిలిందెటకొ సిత్తరము మామయ్య సెప్పిపోరయ్యా! |
| బంగారిమామ: | ఏతీయలోకాలు ఏలాలొ నీ చూపు, తెప్పలా బూదేవి తేలిపోతాది! కాలాడకే గంగ కళ్ళప్పగించేను! సూడకళ్ళే నీయి సోజ్జాలమారి! |
| కోడలుపిల్ల: | అచ్చంగ నీ రూపె అద్దినట్టుంటాది, కొండకొమ్మూదేటి కోటి మబ్బులలో! నీ ముక్కు నీ తీరు నీలికొండలదారి ఎంౘక్క మలిచేను ఏ మాయమనిసో! |
| బంగారిమామ: | మనసులో కలరూపు మబ్బుల్ల విరజిమ్మి, నా బొమ్మదే అంట నవ్వుకొంటావు! నీ వెన్న మనసేను నీ కన్ను మలిచేను నీ సూపులో సోకె నా రూపు రేక! |