| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 10. బులిపింపులు | |
| బంగారిమామ: | పూలివిగో, రంగుల పూలివిగో, గమగమ పూలివిగోనే - పూలల్లో నీ అందము పొంచున్నదిలే! అందము పొంచున్నదిలే! |
| కోడలుపిల్ల: | పూలంటేనే చిరాకు! పూలొద్దోయీ మామ! పూలొద్దోయీ, ఆ పువ్వులు నీ జడకెంతో పొలుపంటవులే ఎంతో పొలుపంటవులే! |
| బంగారిమామ: | పళ్లివిగోనే ముగ్గిన పళ్ళివిగో! తీయని పళ్ళివిగోనే! పళ్ళుతింటె కలలన్నీ పంటకొస్తవీ కలలే పంటకొస్తవీ! |
| కోడలుపిల్ల: | పళ్ళంటేనే వెగటు పళ్ళిట కొల్లలు, మామ పళ్ళొద్దోయీ! పండుతింట పలుకొక్కటీ పలకమంటవు! ఒక్కటి పలకమంటవు! |
| బంగారిమామ: | కతసెబుతానే పిల్లా, కతసెబుతా రావే, కతసెబుతానే! ఆ కతలో మనుషులనిట్టే కళ్ళకు గడతా! చక్కా కళ్ళకుగడతా! |
| కోడలుపిల్ల: | కతలంటే మా విసుగూ, కతలొద్దోయీ మామ, కత విననోయీ! కతలోపల జంట నొకటి కలిపిస్తవులే! జంటను కలిపిస్తవులే! |
| బంగారిమామ: | పదం పాడ మం టావా? పద మినుకుంటావా? వో పదమింటావా? కూకుని పదం పాడతా, గుండెలు పదిలము పిల్లా! గుండెలు పదిలము పిల్లా! |
| కోడలుపిల్ల: | పదమంటేనే గత్తర, పాటంటేనే మంటా! పదమొద్దోయీ, నీ పదమినగానే నెత్తురు పదు నొస్తదిలే! చురచుర పదు నొస్తదిలే! |
| బంగారిమామ: | ఏటిమళుపులో వాలే, ఇసకల పైపయి సోలే ఎన్నెల సూడోలే, మా ఇల్లిల్లని పలవరిస్త వేటి సరసమే? అవురా ఎంత విరసమే! |
| కోడలుపిల్ల: | సన్నగ పురివిచ్చే ఈ వెన్నెల వూసేలో అది మున్నే తెలుసునులే వో వెన్నెల పవళింపుల కిది వేళంటవులే! ఇది వేళంటవులే! |