కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
25. దాగుడు ముచ్చీలు
 
ఘుమఘుమలను మీటే
కొతిమెరచేలు దాటి
కోరికతోవస్తే నను
గోషపెట్టబోకురా
ఏడదాగున్నావోయీ దొరా
     నీ
జాడతెలిసెలేవోయీ వెలికిరా
     వెలికిరావోయి
     వెలికిరా
తెరచాప ఇసురులో
తేలిపోతున్నాయి
తెడ్ల గలగలలా? నీ
తేటనవ్వు కిలకిలా?
మల్లెపువ్వులా చిటుకని విరిసిపో;
మంచుబొట్టులా తళ్కని మెరిసిపో
     మెరిసిపో
         తళ్కని
     మెరిసిపో
కోరతలపాగలో
కుచ్చు మెదిలేను సుమీ;
దొరపుగాకు ఎన్నులలో
దోబూచాడే దొరా!
అడివితురాయని కాపటె పొంచెరా
ఒడిసెలయే టూరకే తినేవురా
ఏటిరెల్లు పొదమాటున
ఈతాలు మరిగినావో
ఒద్దోయీ ఆశ్శికాలు
వూబిలోతు నీళ్ళల్లో
చెదిరిన తొలిచంద్రవంక నీడలో
     మామ
చెదరని పున్నమి నవ్వులు చిల్కిరా
     చిలికిరా
         నవ్వులు
     చిలికిరా
AndhraBharati AMdhra bhArati - kavitalu - daaguDu muchchiilu - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )