| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 8. ఎందుకో ఈ రేయి | |
| కోడలు పిల్ల: | ఎందుకో ఈ రేయి ఇంత చల్లని హాయి! పయన మెందాకాను బంగారి మామా వయనాలు తెలుపోయి వయ్యారి మామా |
| బంగారిమామ: | పైరగాలికి తూగి పంట లచ్చిమిదేవి పవ్వళించేవేళ పల్లదనమేలె! నగవాకె వగలాడి నా చిన్నరాణీ! |
| కోడలు పిల్ల: | మంచోడని నమ్మి మామ నీతోవస్తె, మనిషి మసలని యేటి మళుపులో నటరా మాటామంతీ లేని మౌనాలు రాజా! |
| బంగారిమామ: | ఒంటిగా నీవెంట ఒక్కగడియే చాలు, అడుగులో అడుగేవె అందాల దేవి! మాట లెందుకులేవె మనసున్నచోట |
| కోడలు పిల్ల: | మిసమిసల్ చిమ్మేటి మిరపతోటల నీటు కాటుకల చీకటుల కరిగిపొయ్యేను! నిలుమోయి భయమాయె నీ పున్నెమోయి |
| బంగారిమామ: | కతచెప్పమని నన్ను కవ్వించి కవ్వించి కతకు మూలము జంట కలవకుండానే కదిలిపోదామటే కటికిమనసేమే! |
| కోడలు పిల్ల: | ఏరు తగిలిందంటే ఎనక దారిక సున్న; తోట జీబురుమంట తొంగిచూచేను! దవుదవ్వు పోతావు దరికేనిరావు! |
| బంగారిమామ: | సరుకు తోటల వెన్క చందమా మడుగోను, కోరడవతల ఒక్క కోరికున్నాది- చిన్ని ముద్దొకటీవె చిటిమల్లెపూవ! |