| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 13. ఎందుకో మరి? | |
| ఈయేళ మామయ్య మాయింటి కొచ్చాడు | |
| ఎందుకో మారి ఎందుకో? ఈ సందేళ పులమారి నందుకో | |
| మౌనాలనేగాని మత్తుజల్లనివాడు, కలలోపలేగాని కనపడని మారాజు, | |
| ఈయేళ... | |
| కన్నకల నిజమల్లె కలిచేశె నిన్నాళ్లు; ఈ నిజము కలకన్న ఇచ్చిత్రమైపాయె | |
| ఈయేళ... | |
| తేటమజ్జిగరవ్వ తెప్పించుదామంటె, ఇరుగమ్మ పొరుగమ్మ ఎట మణిగిపొయ్యారొ | |
| ఈయేళ... | |
| ఎవ్వారు లేరనో, ఎవరొస్తరనో, మనసు కిందుమీదవుతాది, బందాల పడతాది | |
| ఈయేళ... | |
| చిగురాకు వెనకాల చిలిపినవ్వులమల్లె దొంగొచ్చి నాడంట తొంగిచూస్తాదేటొ! | |
| ఈయేళ... | |
| చూరుక్రిందుగ వాలి చుక్కల్లు గుమికూడి గుట్టుతెలిసిందేమొ గుసగుసలు పొయ్యేను | |
| ఈయేళ... | |
| కటికి గుండెల తేనె చిటిలిరాలేవేళ, మాయదారీ సిగ్గు మటుమాయమవువేళ | |
| ఈయేళ... | |
| కన్నుగీటేచుక్క కండకావర మెంత! ఏరాౙు తనరాౙొ ఎరుగదో కాసింత!! | |
| ఈయేళ... | |
| అలసిపోయొచ్చావొ, అలయింప వొచ్చావొ అంది అందని మనసు అంపకోత గదయ్య | |
| ఈయేళ... | |