కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
6. గోదారి గట్టంట
 
గోదారి గట్టంట
పోదారి మామా;
సిగ్గులో వలపెటొ
భగ్గుమన్నాది.
పట్నవాసపు గాలి
పడదస్సలే మనకు;
మసక వెన్నెల లింకు
ఇసకతిన్నెల కేసి
  గోదారి...
తొలివాన జల్లుకో,
వలపు కవుగిళ్ళకో
పుల్కరింతలు ఒడల్‌
పొర్లిపోయినవోయి
  గోదారి...
మనసులో కోర్కల్లె
మసలె చివ్వరిదోనె;
తోటకోరడి మలుపు
దాటిపోనీ క్షణము-
  గోదారి...
దారిలో చందురుడు
ఓరచూపులు మాని,
కారుమబ్బుల వెన్క
కనుమూసినాడులే-
  గోదారి...
వానలో మెరుగుపూల్‌
సోనలై దిగజార
చెదరి, కొబ్బరితోట
చేసైగ రమ్మంది-
  గోదారి...
చిలిపి మనపాదాల
చెదరిపో కెరటాలు,
మన జంటచూపుల్ల
మరులు గిలకొట్టాలి-
  గోదారి...
AndhraBharati AMdhra bhArati - kavitalu - goodaari gaTTaMTa - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )