కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
17. ఇచ్చిత్రం
 
నీ వెళ్ళిపోగానె
నిదరపోతాది;
        ఈ తోటలో వున్న
        ఇచ్చిత్రమేటో!
ఏదారి కాయాలో,
ఎట గాలమెయ్యాలొ,
కాలునిలకీపొంత
గాలిస్త నేనుంటె,
        మిసమిసల మేలుకొని
        గుసగుసల్‌ పోతాది!
 నీ వెళ్ళి...
మినుకుమని దూరాన
కనిపిస్తివా చాలు,
నిక్కి నిక్కీ నేను
నిలుచున్న పాళాన,
        సోలిపోతో, మంచు
        పూలు రాలుస్తాది
 నీ వెళ్ళి...
పామల్లె నీపైట
పాకివస్తావుంటె,
నులివెచ్చగా ఊది
మలుపుకొంటా గాలి,
        ఏటిపిల్లంగోడు
        మీటుకొంటది చూడు!
 నీ వెళ్ళి...
కనుసన్న నా చిన్ని
మనివాలకించంగ
ఆగి మూగవరాలు
అందిస్త నీవుంటె,
        పుప్పొళ్ళ బుగబుగల్‌
        గుప్పించి పోతాది!
 నీ వెళ్ళి...
AndhraBharati AMdhra bhArati - kavitalu - ichchitraM - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )