| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 12. కోయిలజంట | |
| కోడలుపిల్ల: | కో... కో... కోయిలనై, నీ కొరకై, మామిడి కొమ్మలలో వొదిగున్నానోయి |
| కో... కో... | |
| బంగారిమామ: | కో... కొహో.. కో అంటే ఒక కోటివరాలే! గున్నమామికొస కోయిలరాణీ! |
| కో... కొహో... | |
| కోడలుపిల్ల: | అలసి సొలసి డస్సిపోయినావని పొలముగట్ల పరవళ్ళయి వస్తిని! చిలకలు కొరకని సీమరేగు పం డ్లొలిచి తెస్తి నొడినిండా నీకై |
| కో... కో... | |
| బంగారిమామ: | మైమరపులు కలిపిస్తువుగద నీ మాటల తేనియ తేటలతోనే! పాటలలో మెదిపేవా ఇకనే పాటి ఫల మమృతఘుటిక కాదుమరి!! |
| కో... కొహో... | |
| కోడలుపిల్ల: | నీకే, నీకొరకే, నీవరకే, నెరివిచ్చిన గుండెలదీపాట! విననీయకు సరుకుతోట కావల వెదురుబిడెము వింటున్నది రాశ్శెము |
| కో... కో... | |
| బంగారిమామ: | మట్టిలోన మాననుకొన్నానే మనిషిపుటక మొన్న మొన్నటిదాకా; అడుగడుగున నీ పిలుపు వినంగనె అందకాడనని అతిశయమేలో! |
| కో... కొహో... | |
| కోడలుపిల్ల: | చిగురాకుల వెనకాల పదిలముగ చిన్న పెదిమలను దాచితి నీకై పూలదుమారము తేలి తేలి తెర వాలిచె నిట, నను బోల్చుకోదొరా |
| కో... కో... | |
| బంగారిమామ: | కోయిలకొదమలు మూగవోయె నీ కొమ్మతేనె లల్లార్చినపాటకు! పూలతోట లెగబోసి వాసనలు పులుకుపులుకుమని కలయజూచేను! |
| కో... కొహో... | |
| కోడలుపిల్ల: | పదిమల్లెలకన్నా తూగుదునా? అదటునడిగి నీయొడి వ్రాలుదునా? చీకటి ప్రొద్దున చిక్కితినిక ఇలు చేర్చవోయి ననుకోరుకొన్నదొర! |
| కో... కో... | |
| బంగారిమామ: | రాలినచుక్కై, దేవలోకపు వ రాలముద్దవై వ్రాలుము రాణీ, కౌగిలిలో ఇమడని నీ రూపము కటికచేతుల్ల కసిగందేనో |
| కో... కొహో... | |