కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
14. కొండదేవత కొలువు
 
కొండదేవతా! నిన్ను
కొలువవస్తినే,
దండాలందుకొని నాకు
దరిశనమీవే...
  కొండ...
ననువలచిన జతగాడు
నాతో రాడీనాడు;
లోకంటికి నీరూపము
సోకదు, అలివికిరాదు
  కొండ...
ఒక్కర్తినె వస్తినంటు
ఉరుముతావు నా వంకా!
కనవో, నా కన్నులలో
కదిలే వెలు గతగాడె
  కొండ...
తప్పులెంచి కళ్ళల్లో
నిప్పులోసు కొన్నారే!
చూడలేదు లోకము మా
సుతిమెత్తని సహవాసము.
  కొండ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - koMDadeevata koluvu - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )