కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
23. మబ్బులు మబ్బులు!
 
మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై
తబ్బిబ్బయ్యెను నా మనసు
తళుక్కుమన్నది నీ సొగసు
ఉరుములురిమి నను తరిమికొట్టితే
మెరుపుతీగ కొరడా జళిపిస్తే
మందవీడిన తువ్వాయికిమల్లే
మన సూరక బెంబేలైపోతది
 మబ్బులు...
కొండలోయలో చిక్కని నీడలు
గుంపులు గుంపులు నడుస్తవుంటే,
గుండెలోతులో నల్లనివరవడి
గుట్టుచప్పుడుగ రాశేదెవరో?
 మబ్బులు...
చిటపటమంటా ఎండుటాకులో
చినుకొక్కటి వడి చిటిలిరాలితే,
కోరికలే గుదిగుచ్చుకొన్న ఒక
హారమె తెగినట్లదురు పుడతాది
 మబ్బులు...
AndhraBharati AMdhra bhArati - kavitalu - mabbulu mabbulu! - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )