కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
4. మొక్కజొన్న తోటలో
 
సుక్కలన్ని కొండమీద
సోకు జేసుకునే వేళ,
పంటబోది వరిమడితో
పకపక నవ్వేవేళ,
సల్లగాలి తోటకంత
సక్కలగిల్లి పెట్టువేళ,
  మొక్కజొన్నతోటలో
ముసిరిన చీకట్లలో,
మంచెకాడ కలుసుకో;
మరువకు మామయ్య.
చీకటి మిణుగురు జోతుల
చిటిలి చిల్లులడక మునే,
సుద్దులరాగాలు చెవుల
నిద్దరతీయక మునుపే;
ఆకాశపుటొడిని తోట
ఆవలింతగొనక మునే,
  పొద్దువాలుగంటనే
పుంతదారి వెంటనే,
సద్దుమణగనిచ్చి రా
ముద్దులమామయ్య!
గొడ్డుగోద మళ్ళేసే
కుర్రకుంకలకు గానీ,
కలుపుతీతలయి మళ్లే
కన్నెపడుచులకు గానీ,
బుగ్గమీస మొడివేసే
భూకామందుకు గానీ,
  తోవకెదురు వస్తివా,
దొంగచూపు చూస్తివా,
తంటా మన యిద్దరికీ
తప్పదు మామయ్య!!
కంచెమీద గుమ్మడిపువు
పొంచి పొంచి చూస్తాది;
విరబారిన జొన్నపొట్ట
వెకిలినవ్వు నవుతాది;
తమలకుతీగెలు కాళ్ళకు
తగిలి మొరాయిస్తాయి;
  చెదిరిపోకు మామయా,
బెదిరిపోకు మామయా!
సదురుకొ నీ పదునుగుండె
సక్కని మామయ్య!
పనలుకట్టి యొత్తి నన్ను
పలకరించబోయినపుడు,
చెరుకుతోట మలుపుకాడ
చిటికవేసి నవ్వినపుడు,
మోటబావి వెనక నాతొ
మోటసరస మాడినపుడు
  కసిరితిట్టినాననీ,
విసిరికొట్టినాననీ,
చిన్నబోకు నలుగురిలో
సిగ్గది మామయ్య.
AndhraBharati AMdhra bhArati - kavitalu - mokkajonna tooTaloo - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )