కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
9. ముస్తాబులు
 
కోడలు పిల్ల: ఈ చీరకు పయటింపో
ఆ రైకకు గడిసొంపో
అందాలను తూచేటి ప
సందు చూపు కలవోడా!
    ఇవరము తెలిపిపోర
    ఇనుకుంటానోయి
        సెబా
    సనుకుంటా రాజా.
బంగారిమామ: పువ్వు వంటి పడుసువు సువు
నవ్వుతు సింగారిస్తె
ఏచీరకు ఎంతందము
ఎదురొచ్చేనో తెలవక
    సిక్కొచ్చిపడ్డదోలె
    చిన్ని రామచిలకా!
        నా
    చిట్టి గులాబిమొలకా.
కోడలు పిల్ల: ఉలకవు పలకవు చాలును,
'ఊ' కొడతా వంతేనూ;
ఆకలిచూపులతో క
ళ్ళప్పగించి చూస్తావూ;
    పరాకు లెందాకా!
    బంగారి మామయ్యా!
        నువు
    దొంగవులేవయ్యా!!
బంగారిమామ: ఏమని బులిపించేవో
ఇనిపించదు రవ్వంతా;
కదిలే నీ పెదిమలతో
కలలువ్రేల్చి నా కళ్ళకు
    పనిగలిపిస్తువుగదె
    పైడి లేడికూనా!
        నా
    బంగరు విరికోనా!
కోడలు పిల్ల: ఈ రవ్వల ఆ మువ్వల
నెది నాజూకైన నగో
చెప్పరాదొ చనువున కయి
సేయరాదొ మనసారా?
    నీపయి మెచ్చని కళ
    నేరమెకద, నీయెడ
        అప
    చారమెకద రాజా!
బంగారిమామ: అందాలకు మారుపేరు
అమ్మాయొకతున్నదటా!
నగవుంచితె ఒడలి మెరుగు
సగము తరిగిపోవునటా!!
    చిల్లర ముస్తాబులు
    చెల్లునె సుకుమారీ?
        నా
    మల్లెల రహదారీ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - mustaabulu - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )