కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
18. నారాత
 
నా
రాతకిలా నలుగురిలో
నవ్వులపాలేన?
 నా...
రాతకిలా
కలకలేని వలపులోని
మెళుకువ లెరిగినవాడు,
అలిగినాడు నాపయి తన
కలలనీడె పడనీడు
        ఏమని పంతాలో ఇం
        కెంతని రోసాలో?
 నా...
రాతకిలా
ఏడదాగినావో నని
ఎల్లెడ వెతుకుదు నేను,
ఎచట దాచితివె దొరనని
ఎల్లరు నన్నడిగేరు!
        ఏకడ మసిలేవో నీ
        వెట బింకము సూపేవో!
 నా...
రాతకిలా
సరసనున్న వేళా నా
దొర నేనొకటని పొగరు;
రవ్వ దూరమయినా ఇక
రాడని ఒకటే బెదురు;
        ఏక మనసుకోత ఒక
        యేటికి ఎదురీత!
 నా...
రాతకిలా
కోపాలకు మూలమిదని
గొప్ప వూసు చెప్పేనా,
ఇంతేనా గుట్టని న
న్నీసడింతు రోరన్నా;
        లోకానికి వింత నా
        లోగల వలపంత!
 నా...
రాతకిలా
AndhraBharati AMdhra bhArati - kavitalu - naaraata - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )