కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
19. ఒంటరి పయనం
 
ఒంటరినై పోనా,
        ఈ
ఓరుగాలిలోన దొరా!
 ఒంటరినై...
చిలిపి చిలిపి జగడాలకు
ఒలికే సింగారమొంచి
అలకదీర్చి, కలకదేర్చి
పలకరించువారు లేక
 ఒంటరినై...
నిదరమాను నీడలంట
చెదరిన వెన్నెల రేకుల
పదునెక్కిన ౘురకత్తులు
పట్టీ ౙళిపింతురెవరొ
 ఒంటరినై...
మొగలిడొంక మలుపులోన
మోము దాచుకొన్నావా?
దొండపందిరుల కిందై
దోబూౘాడేవ దొరా?
 ఒంటరినై...
చీకటి వెలుగుల సందున
చీలిన నీరెండలలో
జలకమాడ అడివిపిచుక
ౙంటలవే రివ్వుమంట!
 ఒంటరినై...
ఏటిమనసు తోటసొగుసు
ఏకమయిన చోటిక్కడ
సరస నీవు లేని బతుకు
సందర మనిపిస్తదోయి!
 ఒంటరినై...
AndhraBharati AMdhra bhArati - kavitalu - oMTari payanaM - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )