కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
26. పాటవిసురు
 
చూపులోసిరి చిందువాడా?
ఓపలేని గుండెలోతులు
పాటలో పలికించి పోవేరా
 బంగారిమామా
తేటెతేనెలతీయ మొలికేలా
     రావోయి నావన్నెకాడా
     రావోయి నాచిన్నివాడా
పండివాలిన కంకులన్నీ
పట్టిమీటిన తంబురాలో
పంతమాడే పాటపాడాలీ
 బంగారిమామా
వంతు బొయ్యే వరసలెత్తాలీ
     రావోయి నావన్నెకాడా
     రావోయి నాచిన్నివాడా
కాటుకాకొండాల మళుపున
ఏటిలో నీలాల తళుకులు
మూటగట్టిన పాట విసరాలీ
 బంగారిమామా
ముచ్చటైన పదాలు పలకాలీ
     రావోయి నావన్నెకాడా
     రావోయి నాచిన్నివాడా
చంకలో పసివాని కన్నుల
ఝల్లుమనిపించేటి మాటల
వీరకతలే తెల్పిపోగదరా
 బంగారిమామా
వేడినెత్తురు పొంగిపోవలెరా
     రావోయి నావన్నెకాడా
     రావోయి నాచిన్నివాడా
నాటిచేవా నాటిజీవము
నేటి మన బైరాగిబ్రతుకున
ఊదరా ఊయించి పోవేరా
 బంగారిమామా
బూదిలో పూరించవలె రవ్వా
     రావోయి నావన్నెకాడా
     రావోయి నాచిన్నివాడా
AndhraBharati AMdhra bhArati - kavitalu - paaTavisuru - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )