కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
28. పట్నానికి పయనం
 
పట్నవాస మెందుకులే
     బంగరిపిల్లా! ను
వ్విష్టపడితివా స్వర్గం
     భూతలమెల్లా
సరుకుతోట తేనెతేట
     సంగీతపు ఝల్లు
కందిచేల నులివెచ్చని
     కాసుల ఘల్‌ఘల్లు
అనుకోనీ రాజభోగ
మమరిన ఈకోన విడిచి
  పట్న...
ఒడలొంచితె లొంగిరాని
     బడుగునేల కలదే?
పిడుగడినా అడలిపోక
     నిలబడి పోవలదే
అలిగిందని కొండవాగు
వలస పోదమంటావు
  పట్న...
ఇంకిపోతు ఇంకిపోతు
     ఏరు వ్రాసిచనదా
ఇసకనేల వక్షస్సున
     ఏటా మనగాథా
గురుతులివే వేనవేలు
చెరపకువే ఆనవాలు
  పట్న...
పల్లెపట్టు నీడలలో
     పరిమళించినాము;
కల్లాకపటాల మకిలి
     డుల్లిపోవలేము
తొడిమనున్న జంటపూలు
దూసినట్టు లయిపోతము
  పట్న...
AndhraBharati AMdhra bhArati - kavitalu - paTnaaniki payanaM - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )