కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
32. రాౘపగ
 
రగిలింౘవాకోలె వగలాడి పడుచ
రాచపగ నాదోలె తాచుపగనాది!
కూలిబత్తెపురాళ్ళు కూటికే రావంటె,
కొట్టవచ్చిన బాబు కొలువుసెయమంటావు
  రగిలించ...
కుమిలిపోయే బ్రతుకు కుళ్లబొడిచే తిట్లు
దిగమింగమంటావు తగవాడకంటావు
  రగిలించ...
నాచేతిమీదుగా నడిచిపోయిన సిరులు
ననె వెక్కిరించితే నను కాదనుకోన?
  రగిలించ...
ఒకడనైతే నేమి ఒట్టిరోసమ నాది?
కలిసికట్టుండాలి కలబడాలంటావు
  రగిలించ...
మొర వినే దెవడోలె తిరగబడతా నంటె,
మంచిరోజులు కాదు మనకిప్పు డంటావు
  రగిలించ...
కుతికకంటా తిన్న గొప్పోరి పాదాల
రాధారి మనబ్రతుకు లేదారి మనకింక
  రగిలించ...
కూరుచున్నా దొరకు కుప్పలందించాల!
తిరిగితిరిగీ మనకు తిప్పలేనా కొసకు
  రగిలించ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - raachapaga - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )