కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
11. రాకోయి రాజా
 
రాకోయి నా రాజా
    అపుడె
రాకోయి నారాజా!
    నీ
రాణిగారు కబురంపేదాకా
  రాకోయి నా....
వస్తావని పదినాళ్ళయి విన్నా;
ముస్తాబింకా ముగియనెలేదు;
మోహపడిన నారాజు కనులలో
మోజుచెడిన బ్రతుకేలకాల్పనా?
  రాకోయి నా....
పండువంటి నా వొడలికి దీటని
పండుగనా డీ వంపిన చీర,
ఎట విడిచితినో, ఎటు మరచితినో,
ఏమి తేల, దెటుపాలుపో
    దపుడె
  రాకోయి నా....
రానన్నాళ్ళూ రాత్తిరిపగలూ
రాలేదని గుండెలలో దిగులు!
వస్తావని విన్నపుడే మొదలూ
వచ్చి గడియ నిలవోయని గుబులూ
  రాకోయి నా....
మల్లెలు మనుసో, మంకెన సొగుసో,
మది నీ కెది ఇంపగునో తగునో,
అడివి, కోన గాలించి వెతికినా
అందమైన పూ వమరదు సిగలో!
  రాకోయి నా....
సిగ్గుతెరలలో చిరునవుపొరలో
చిటిపొటిమాటలు చిలికేతీరు
పల్కుటలో, మరి పల్కరింపులో,
పట్టుపడలేదు పరాకె వదలదు
  రాకోయి నా..
AndhraBharati AMdhra bhArati - kavitalu - raakooyi raajaa - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )