| కవితలు | బంగారిమామ పాటలు | కొనకళ్ల వెంకటరత్నం |
| 2. రావోయి బంగారి మామా | |
| రావోయి బంగారిమామా | |
| నీతోటి | |
| రహస్య మొకటున్నదోయీ పంటకాలువ ప్రక్క జంటగా నిలుచుంటె నీడల్లో మన యీడు జోడు తెలిశొస్తాది- | |
| రావోయి... | |
| ఈ వెన్నెల సొలపు ఈ తెమ్మెరల వలపు రాత్రి మన సుఖకేళి రంగరించాలోయి- | |
| రావోయి... | |
| నీళ్లతూరల వెన్క నిలుచున్న పాటనే జలజలల్ విని, గుండె ఝల్లుమంటున్నాది- | |
| రావోయి... | |
| ఈనాటి మన వూసు లేనాటికీ, మనకు, ఎంత దూరానున్న, వంతెనల్ కట్టాలి- | |
| రావోయి... | |
| అవిసె పువ్వులు రెండు అందకున్నయి నాకు; తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని- | |
| రావోయి... | |
| ఏటి పడవసరంగు పాట గిరికీలలో చెలికాడ మనసొదల్ కలబోసుకుందాము- | |
| రావోయి... | |
| జొన్నచేలో, గుబురు జొంపాలలోగూడ, సిగ్గేటో మనసులో చెదరగొడుతున్నాది- | |
| రావోయి... | |