కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
31. రోడ్డు రోలరు
 
లాగరా, హయిలెస్స లాగరా,
రోడ్డురోలరు ముందడుగై సాగరా
నడినెత్తిన సూరీడు నకనకలాడించేడు;
కంకరరస్తాలో సగమింకా మిగిలున్నదిరా
  లాగరా...
రోల్సురాయి మోటార్ల షికార్లకు కుదుపొచ్చిందంట?
పూలపానుపల్లె తోవ పొడుగున మలసాలంట
  లాగరా...
గోదావరి వరదలొచ్చి గోలగున్నదంట ఈడ;
కట్టసుకా లింటానికి గవినే రొస్తాడంట
  లాగరా...
మారువాడి అప్పుకంటె, మాయదారి బ్రతుకుకంటె
బరువా ఇంతోటిపెద్ద బందరాయి మామయ్య?
  లాగరా...
లచ్చలున్న సావుకారు లాభాలను మోసిందుకు
బారీయాపారములో లారీ కొన్నాడంట
  లాగరా...
మర్రిసెట్టు ఊడనీడ, మడిసిపురుగు లేనికాడ
సనుబాలకు కక్కటిల్లి సంటో డేడుస్తుండడు
  లాగరా...
మెతుకు విదిపితేనే తమ బతుకుపోయెననుకుంటరు
మాదాకవళం మల్లన మడిసిపోయిం డీపక్కనె
  లాగరా...
పొలము పుట్ర అమ్ముకోని, పొట్టసేత బట్టుకోని
వలసపోయిం డీదారినె పంటకాపు పట్నానికి
  లాగరా...
AndhraBharati AMdhra bhArati - kavitalu - rooDDu roolaru - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )