కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
33. సందరాలుదాటి
 
సందరాలేదాటి
సరస నున్నావంటె
సహస మికే ముందిరా?
         ఓమామ
సంబర మికే మందురా
మసక వెన్నెలబైట
మాగన్ను నిదరలో
గుడిగంట లొకవేయి ఊగెనా?
         ఓమామ
గుండెలోతులలోన మోగెనా?
నీరెండపసుపులో
నిగ్గుదేరిన గడప
ముంగిట్లో నీ అడుగుజాడ!
         ఓమామ
ముగ్గేసెరా వన్నెకాడ
పెరటిలో చిటిమల్లె
విరగబూసిందేర?
పులకరించీ వొళ్లు పొంగేనా?
         ఓమామ
పూలు బరువై తీగ వంగెనా?
ఏరాజు గెలిచేనొ
ఎందుకీ సొదనాకు?
ఏరాజులేమైతే ఎందుకోయీ మామ
నారాజె నాకేసి నడిచిరా
కూడబెట్టిన వయసు
గుట్టుచెదరని మనసు
నీకోసమే నోయి నిరుకుగా
         ఓమామ
నిలుపుకున్నానోయి నీతిగా.
AndhraBharati AMdhra bhArati - kavitalu - saMdarAludATi - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )