కవితలు బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం
5. విందుకు పిలుపు
 
మాపటివేళా విందుకు రావోయ్‌,
మతకరి మామయ్యా!
జాతరలోపల పిల్లామేకా
సరదాలో సతమతమై వుంటరు
  మాపటి...
అందముగా, తీ పందుకునేలా,
అరిసెలు నోటికి అందిస్తానో,
వారిస్తూ, చవులూరిస్తూ, "నా
బుగ్గలె రుచి" అని బులిపిస్తానో,
అందీ పొందని
ఆశలు పోకోయ్‌
  మాపటి...
కోరికతో, కొనగోటి విడుపుతో
మీగడ పెదిమల మీటిస్తానో,
కనుగొసలో తడిమనుసులు జార్చే
కాటుక చూపుల కవ్విస్తానో,
వివరణగా మా
టివగల నటరా?
  మాపటి...
అలమటవో, ఆయాస మిగిరిపో,
కొంగున విసరీ కరిగిస్తానో,
ఊహలలో వ్యామోహము చెరిగే
ఊర్పులతోనే ఉడిగిస్తానో,
ముందే ఆరా
లెందుకు పోరా
  మాపటి...
ఏలపదాల ఉయాలలలోన కి
లారింపుల నిను లాలిస్తానో,
ముసిముసిగా విడు గుసిలింతల, పొడి
మాటలతోనే మరిపిస్తానో,
నా నోటంటె వి
నాలంటే సరి!
  మాపటి...
రాశ్శెము తొణుకు పరాసికములలో
తమలపు చిలకలు నమిలిస్తానో,
పెదిమల కొసలో కదిలే కలలకు
పొంగే వలపుల రంగేస్తానో,
ఈలలు తియకోయ్‌
కీలక మివనోయ్‌
  మాపటి...
పందిరికొస పూ బంతి వరసలో,
పరుపులు జంటగ పరిపిస్తానో,
పదిలముగా, నీ హృదయములో అడి
యాసలు పరిచీ అలయిస్తానో,
మగువే తానై
మనసిస్తాదా?
  మాపటి...
AndhraBharati AMdhra bhArati - kavitalu - viMduku pilupu - baMgArimAma pATalu - konakaLla veMkaTaratnaM - telugu kavitalu - tenugu andhra ( telugu andhra )