కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి మనవి

మనవి

తెలుగుఁ తోఁటకు నవవసంతోదయమైన తోడనే కవికోకిలములు తెలుఁగునా డంతయుఁ జివురింపఁ బాడినవి. అందు వన్నెకెక్కిన పుంస్కోకిలములతో గానముచేసిన దీ "గౌతమీకోకిలము."

ఈ కవివతంసములు పాడిన గీతములన్నియుఁ గాకున్నను, గొన్నియైన సంపుటములుగ నచ్చుపడి నవ్యసాహిత్య భాండారమునఁ జేరినవి. కాని యీ "గౌతమీకోకిల" గీతములు మాత్రము గాలిలోనే నిలిచిపోయి రసపిపాసువుల కందరానివై పోయినవి. వానికొక కూర్పుసేకూర్చు భాగ్య మిన్నేండ్లు గడచినను తెలుఁగుభూమికిఁ గలుగలేదు. ఇందులకు రసజ్ఞులు పత్రకాముఖమున నెన్నిమాఱులో వగచిరికూడ.

శ్రీ సత్యనారాయణశాస్త్రిగారి కవిత్వమునందు నాకు గౌరవము కలదు. వారి భావనాశక్తి బలమైనది. వారు కవిసమయములను విడువ లేదు. తెలుఁగుగడ్డను బుట్టిన యుత్తమ సంప్రదాయముల నుల్లంఘింప లేదు. వారి భాషకుఁ బ్రాచీనుల పటిమయున్నది. జీవితకల్లోలమునుండి యుబికిన దగుటచే వారి కవిత్వమునకు నిండుజీవ మున్నది. రసవంతమైన యీ కవిత్వము సంపుటరూపము దాల్చవలసియున్నది.

కవులు తఱుచు ధనికులు కారు. సర్వము ప్రజాశ్రయము కానున్న వేళయగుటఁ గళకు రాజాదరముండవలెనన్న తొలినాఁటి మాటలకుఁ గాలము గడచినది. కళకుఁ బ్రాపుగాఁ బ్రజలు నిలుచుట బాధ్యతయే కాక, ఔచితికూడ నైనది. ఉత్తమకావ్య మే రసలుబ్ధుఁడైన ధనవంతునో వరించుటకంటెఁ బలువురు రసజ్ఞుల పూన్కితో వెలువడుట కవికిఁ గౌరవము. ఆ ప్రజలకు గౌరవము. ఈ యూహ యాచరణ యోగ్యము కావలెనని నా యుత్సాహము.

ఉత్తమ కవులను సన్మానించుట వారినిగన్న దేశీయుల విధి. మహాకవు లీనాఁడు బ్రదికివచ్చిన యందలము లెత్తుదు మనుకొందురు గాని, ప్రతిభగల కవులు కాసునకుఁ గఱవై మూల్గుచున్న నొక్క కన్నీటి చుక్కైన విడువరు. మనలోనున్న కళాభిరతులను గౌరవింప నేర్చుకొనుట నా యభీష్టము.

ఇట్టి తలఁపులెన్నో ప్రేరేపింప శ్రీ శాస్త్రిగారిని దమ పద్యకావ్యము మిత్రుల సాయమున ముద్రింపనిండని కోరితిని. వారు తాము స్వయముగ గడించిన ధనముతోఁ దమ ప్రథమ సంపుటము నచ్చు వేయించి మిత్రులి శ్రీ నూతక్కి రామశేషయ్యచౌదరి గారి కంకిత మొనర్పఁ బ్రతిజ్ఞయని తెలిపితిరి. తమకది యింతలో సాధ్యమగునది కాదని, సాధ్యమగువఱకు భీష్మించుట సమంజసము కాదంటిని. నా బలవంతమునకు మా మైత్రి పురస్కరించుకొని వారంగీకరించిరి.

నేఁడు ఫాల్గుణ బహుళషష్ఠి. శ్రీ శాస్త్రిగారి జన్మదినము. ఇది వారి జీవిత ప్రవాసమునకు రజతోత్సవసమయము కూడ. ఈ "దీపావళి" ముద్రించి నేఁడు జన్మదినోత్స వోపాయనముగా నొసఁగి పండితసమక్షమున వారిని సన్మానింపవలెనని సంకల్పము. నాయం దవ్యాజానురాగము గలిగిన మిత్రుల సాహాయ్యమునఁ గృతకృత్యుఁడ నైతిని. శ్రీశాస్త్రి గారును సుహృద్వరులైన శ్రీ నూతక్కి రామశేషయ్యచౌదరిగారి కీకృతిని సమర్పించి యానందించిరి.

సాయమొనర్చిన మిత్రుల కందఱ కీ యవకాశము గైకొని నమస్కరింతును.

కందుకూరి రామభద్రరావు.
కాకినాడ,
ధాత ఫాల్గుణ బహుళ షష్ఠి.

AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - vEdula satyanArAyaNa SAstri - gautamI kOkila ( telugu andhra )