కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి ప్రశంస : దివాకర్ల

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి విశిష్టసభ్యుల ప్రశంస
డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని

(విశిష్ట సభ్యత్వ ప్రదాన సమావేశపు తేది: 7-1-1967)

భద్రాచలము తాలూకాలోని గొల్లగూడెమున జన్మించి (22-3-1900), సంస్కృత కావ్య చంపూ నాటక గ్రంథములను, వ్యాకరణాలంకార శాస్త్రములను సుప్రసిద్ధ గురుపుంగవులతో నభ్యసించి, కన్నడ వంగ భాషలు కూడ నేర్చి, ఆంధ్ర విశ్వవిద్యాలయమువారి ఉభయభాషాప్రవీణ పరీక్షయందుత్తీర్ణులై, కవిపుంగవులై, నవలా నాటక కర్తలై, అవధాన విద్యయం దారితేరి, పాఠశాలా కళాశాలలం దుపాధ్యాయులై, బహు సంగీత సాహిత్య సంస్థలచే సన్మానితులై, మృదుమధురమైన తమ కవితాపంచమస్వర సంచయముచే నాంధ్రదేశమునం దంతట నకాల వసంతముల నావిర్భవింపఁజేసి గౌతమీకోకిల యన్న నన్వర్థనామము నార్జించిన అపార ప్రతిభా సంపన్నులు శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రిగారు.

ఆధునికాంధ్ర వాఙ్మయమున ప్రకృష్టమైన ప్రతిభాసంపదతోపాటు పారములేని పాండితీపాటవమును గూడ వహించి విద్వత్కవి పుంగవులై వెలయు స్వల్పసంఖ్యాకులలో నగ్రశ్రేణికిఁ జెందినవారు శ్రీ సత్యనారాయణ శాస్త్రిగారు. శ్రీ శ్రీనివాసాచార్య మృత్యుంజయశాస్త్రి, సోమనాథశాస్త్రుల శుశ్రూష వైదుషీవిభవమునువలెనే శ్రీపాద కవిసార్వభౌముల శుశ్రూష వారికి కవితాకళాకౌశలమును గలిగించినది. ఉభయభాషా ప్రవీణులైన పిమ్మట వారు గోదావరీ మండల మందలి యున్నతపాఠశాలలందును, తదుపరి కావలి కళాశాలయందును ఆంధ్రోపాధ్యాయులై తమ సరసబోధన సామర్థ్యముచే శిష్యసంతతులకు భాషా పరిజ్ఞానముతోపాటు బంధుర కవితా లాలసతయు పెంపొందించి వారి భక్తిమన్ననలకు పాత్రులై పరిఢవిల్లిరి.

శ్రీ శాస్త్రిగారు ఖండకావ్యములు వెలయించిరి; నవలలు రచించిరి; కథలు కల్పించిరి; అనువాదములు కావించిరి; బాలబాలికల యుపయోగార్థమై మధురమంజులమైన శైలిలో మహాభారతమును ప్రచురించిరి.

భావగంభీరములు, ప్రసాదగుణ భాసురములు, ధారాశుద్ధి దంతురములు నైన రసవత్ఖండకావ్యములతోఁ గూడిన వారి దీపావళి భావకవిత్వము క్రొత్తగా వెలువడిన యాదినములలో నాంధ్ర యువతీ యువకుల హృదయములం దానందాలోకములను వెదచల్లినది.

సాహితీసమితి సభ్యులై యాంధ్రవాఙ్మయాకాశమున నూత్నకవితాకాంతులు వెల్లివిరియించిన భావకవిభాస్కరులలో శ్రీ శాస్త్రిగారొక్కరు. దీపావళియందలి కావ్యము లొకవంక వారి పాండితీపాటవమును, వేఱొకవంక వారి ప్రతిభాపాటవమును, ఇంకొకవంక వారి పదప్రయోగ ప్రౌఢిమను జాటుచు నాంధ్ర రసికవతంసుల యసదృశ ప్రశంసల నందుకొన్నవి.

వారి కవిత యెంత నవ్యమో యంత సంప్రదాయ సిద్ధము; ఎంత ప్రసన్నమో యంత గంభీరము; ఎంత ఆలంకారికమో యంత యనవద్యము. మసృణ మకరంద మాధుర్యమువలె వారి మంజుల కావ్యరసము నాని పరవశులు కాని రసిక మధుకర కుమారులుండరు.

అపరాధిని, ధర్మపాలుఁడు అను పెద్దనవలలును, సోనామహల్‌ అను చిన్న నవలయు, వేసవిమబ్బు లను కథల సంపుటమును శ్రీ శాస్త్రిగారి కథాకథన కౌశలమునకు, పాత్రచిత్రనపాటవమునకును, భాషాప్రయోగ ప్రౌఢిమకును పట్టుఁగొమ్మలై యాంధ్ర పాఠక లోకము నలరించినవి. వారి రాణాప్రతాప నాటకము సహజ సంభాషణములతోఁ గూడిన రసవద్రూపకరాజము. 'కాలేజీగరల్‌' అనువారి సాంఘికనాటకము సరళమయ్యు సంస్కార శోభితమై సహృదయ హృదయానందము సంధానించినది. వారి విజయ ప్రభ సహజసుందర మైన శైలితోఁ గూడి తెలుఁగు పలుకుల తియ్యఁదనముతోపాటు మహాభారతమందలి మహనీయకథా మహత్త్వమునుగూడ బాలబాలికలకుఁ గరతలామలకము కావింపఁజాలును.

శ్రీ శాస్త్రిగారు సంస్కృతాంధ్రములతోనె కాక వంగ కన్నడ భాషలతోఁగూడ సన్నిహితమైన పరిచయము గలవారు. వారు రవీంద్రుని 'చోఖర్‌బాలి' కిని, బాలసాహిత్యమునకును గావించిన ఆంధ్రానువాదములు మూలమున కెందుకు దీసిపోక యా మహాకవి ప్రతిభా భాండారమును తెలుగువారికి సమగ్రముగా చూఱయిచ్చుచున్నవి. అట్లే మూలమున కన్యూనాతిరిక్తముగ వారు కావించిన భాస నాటకానువాదములు కూడ ననువాద విధానమున కాదర్శప్రాయములై అలరారఁ జాలును. ఈ యనువాదము లచిరకాలముననే ముద్రితములై యాంధ్రభారతి యఱితి కపూర్వాలంకారము లగును గాక!

శ్రీ శాస్త్రిగారి ప్రతిభాపాండిత్యములను గుర్తించి యాంధ్రులు వారి నర్హరీతి సన్మానించి యుండిరి. సామర్లకోటలో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులవారు విద్వత్కవిపుంగవుల సమక్షమున మహాకవి బిరుదము నొసంగి శిష్యునిపై నాశీస్సులు కురియించిరి. గౌతమీకోకిల, శతావధాని యను సార్థక బిరుదములు శ్రీ శాస్త్రిగారు సహజకవితావధాన చాతుర్యముచే సంపాదించుకొన్నట్టివి. ఏలూరునందలి నవ్యకళా సమితివారును, కాకినాడయందలి సరస్వతీ గానసభవారును, గౌరవార్హు లైన శ్రీ పి.వి.జి.రాజుగారి యాధ్యక్షమున కావలి యందలి విశ్వోదయ సంస్థవారును శ్రీశాస్త్రిగారి నఖండ సన్మాన పూర్వకముగ నభినందించి యుండిరి.

శ్రీ శాస్త్రిగారు విద్వత్కవివతంసులు. ప్రసాదమాధుర్యములు వారి కవితకు పెట్టని సొమ్ములు. వారి కవిత్వమువలెనే హృదయమును రసపేశలమైనది. మిత్రులన్న వారికి ప్రాణము. శిష్యులన్న వారి కమిత వాత్సల్యము. వారి బోధనాశక్తి అసాధారణ మైనది. వారి కవితాపాండితులు సర్వాంధ్రజన సంతోషదాయకములు. అధ్యక్ష మహాశయా! ఏతాదృశ గుణగణ శోభితులైన శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి కాంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వముతో పాటు తచ్చిహ్నములైన అమూల్యాంబర స్వర్ణపతకములను గూడ సమర్పించి గౌరవింపఁ వేఁడుచున్నాను.

AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - vEdula satyanArAyaNa SAstri - gautamI kOkila ( telugu andhra )