కవితలు గుడిగంటలు కాటూరి వేంకటేశ్వరరావు
కృతిసమర్పణము
ఇరువదేండ్లాయెఁ బౌలస్త్యహృదయమును ర
చించి, గుడిగంటలం జెప్పి చెల్లెఁ బదియు
నైదు వర్షము, లొక పద్యమైన మరలఁ
జెప్పినది లేదు; కవినంట సిగ్గుగాదె?
ఇంక నే గృతు లల్లుట యిల్లగాన
ఈ కృతులు రెండు స్వర్లోకమేగినట్టి
యన్నకున్‌ రామకృష్ణయ్య కంకితమ్ము
సలుపుదుఁ పితౄణభారమ్ముఁ దలఁగు పొంటె
నేరఁడు మంచిచెడ్డలు, గణింపఁడు గీమునఁ గష్టసౌఖ్యముల్‌
వీఱిఁడియై సదా తిరుగు వీఁడని రోయక, నన్ను, మత్ప్రజన్‌
గూరిమి నోమె; అగ్రజునకుం దుదకిచ్చితి నిష్ఠురాగ్నిసం
స్కారము; నింక నా యొసఁగఁ జాలిన దొక్కకృతి ప్రదానమే
ఆలుంబిడ్డలు, పైరుపచ్చ లనకే 'యాగమ్మకాకిం'బలెన్‌
గాలిచ్చందిరుగాడు దుర్వ్యసని, నాకై యెంత చింతించెనో
లోలో; నెన్నఁడు నొవ్వనాడఁడు, దయాళుండై ననుం బ్రోచె; స
చ్ఛీలుం డన్నకు నీకృతిద్వితయమున్‌ జేమోడ్చి యర్పించెదన్‌.
నా తమ్ముండు కవిత్వ మల్లునని యెన్నండైన మాయన్న సం
ప్రీతిం జెందెనొ లేదొ నేనెఱుఁగఁ; దద్వేతృత్వ మూహించి నా
కైతల్‌ సిగ్గిలు; నైన వాని ఋణ మీఁగన్‌ వేఱలేమిన్‌ దయా
ఖ్యాంతుండైన మదగ్రజన్మునకు నీ కబ్బమ్ము లర్పించెదన్‌.
గుడిగంటలు
ఏలికవై జగమ్ములకు నేడు మలల్‌ పయి కొమ్మమీఁద శ్రీ
నీళలు జోలవాడ శయనించిన దేవర! మేలుకో! కృపా
వాల! శ్రితానుకూల! శ్రుతిసార చరత్పదపద్మ! మేలుకో
నీలసరోజపత్ర రమణీయ విలోకన! మేలుకోఁగదే!
నైగమ మూలమంత్రములు నాందిముఖమ్ములు విశ్వసృష్టికిన్‌
యోగిసమాజమానసగుహోదిత మంగళదీపికారుచుల్‌
సాగరకన్యకాహృదయసారస షట్పదగీతికారుతుల్‌
నీ గుడిగంట సవ్వడులు నింగి చెలంగెఁ బ్రబుద్ధలోకముల్‌.
తిరుపతితుంగశృంగవసతీ! వినవచ్చెను సుప్రభాత గీ
తరవము, సౌఖశాయనిక దాసజనుల్‌ కపురంపుటారతుల్‌
కరములఁ దాల్చినిల్చిరి, జగమ్ములు నీ కనువిప్పు వేచెడిన్‌
సరగున మేలుకో, కొలువుసాలను దర్శనమిచ్చి యేలుకో!
అరుణగభస్తి నీ గిరుల యంఘ్రులు ముట్టి, ప్రదక్షిణించి, గో
పుర శిఖరమ్ములం బొదివి పుష్కరిణీజలజాతకోశముల్‌
విరియఁగఁజేసి, పుప్పొడులు వేయికరమ్ములఁ దాల్చినిల్చె దే
వర తిరుమజ్జనమ్ము తఱివార్చి, జగత్పతి! మేలుకోఁగదే.
తిరుమలవాస! వేంకటపతీ! తిరుమజ్జనమాడి, భూషణో
త్కరములు బైడిపుట్టములు దాలిచి, లోకవిమోహనమ్ముగాఁ
దిరుమణిబొట్టు నెన్నొసట దిద్ది, సహస్రమయూఖకోటిభా
సురమకుటమ్ముతో భువనసుందర దర్శనభాగ్య మీఁగదే.
ఆడెద రచ్చరల్‌, కరము లౌఁదలఁజేర్చి బలారి మున్నుగాఁ
వేఁడెద రాద్యులౌ మునులు, విప్రవరుల్‌ ద్రవిడ ప్రబంధముల్‌
పాడెదరోయి, శేషగిరివాస! హజారపు గొల్వు వాకిటన్‌
గూడిరి విందులై హరిజనుల్‌ తెఱపించవె ద్వాఃకవాటముల్‌.
చీమలబారులై నగముచెంత విహంగమపంక్తులయ్యు, శా
ఖామృగతండ మౌచు, మునిగాళుల దాఁటెడి మేఁకమందలై,
వామనమూర్తులై, దరియవచ్చిరదే! నరనారు లో పరం
ధామనివాస! యీ హరిజనమ్ములు విందయి తల్పుదీయవే.
ఏడుకొండలనెక్కి యీరేడు లోకముల్‌ పాలించుకొనెడి మాపాలివేల్ప!
చేఁదికోవే మమ్ము శ్రీనివాసా! వడ్డికాసులవాడ! వెంకన్నస్వామి!
అడుగడ్గు దండము లాపదమ్రొక్కులదేవరా! మము చేఁదికోవె వరద!
వేంకటరమణ! గోవింద! హరీ! ఏఁదికోవయా దేవాదిదేవ! మమ్ము
చేఁదికొమ్మింత చేయిచ్చి, ఆఁదుకొమ్ము చేఁదికో చేఁదికో యంచుఁ జేతులెత్తి
హరిజనులు గొండ లెగఁబ్రాకి రభయముద్ర మెరయఁ బ్రత్యక్షమగుమయ్య! తిరుమలయ్య!
అదెయిదె శేషశైలమని యదటనొండొరుఁ బిల్చుచున్‌ శ్రమం
బొదవిన నిన్నుఁ బేర్కొనుచు, నొక్కకటే మల లెక్కివచ్చి, నీ
పదములు చూచువేడ్క విరబారిన వీరల చూడ్కు లెంతగా
గొదగొనియున్నవో, తలచుకో నెరచూడ్కులఁ గౌగిలించుకో
దిద్దిన పట్టెనామములు, దీర్చిన తిర్మణిబొట్లు, మోములం
దొద్దిక, చూడ్కులందు నెనరుప్పతిలన్‌ గతిమోడ్పుమాలికల్‌
పెద్దలు పిన్నలున్‌ వరుసవెంబడిఁ దాలిచి నిల్చియుండ, దీ
వ్యద్దయ! డాగికోఁ దగదయా! కడుదొడ్డ దొరౌదులేవయా!
అడుగగరారు రాచరిక, మాపద మ్రొక్కులవారుగారు, నీ
కుడుగర లీయలే, రడుగనొల్లని యర్థము వేఁడఁబోరు, వీ
రడిగిన దొక్కటే విరచితాంజలిమాలలు మాలలెల్ల నీ
యడుగుఁగవన్‌ బ్రపన్నజనతార్తిహరమ్మును జూడనీఁ గదే
వేదశిఖాధ్వనీన, మరవిందసఖ మ్మమరేంద్రపూజితం
బాదిమ సర్గమూల మఖిలాశ్రితరక్షణదక్షమైన శ్రీ
పాదయుగమ్ము దౌలగఁని పాణితలమ్ములు మోడ్చి ధన్యులై
పోదురు వీరు; వాకిళులు మూయకు నీ గుడికో దయాలయా!
వినుమోదేవర! కొండపై వెలసె గోవిందుండు వెంకన్నయం
చనుకొంటే వినుచుంటెకా కెఱుఁగరయ్యా! జియ్య! నీరూపమున్‌
జినదేవుండవొ, శక్తివో, శివుడవో, శ్రీమద్వికుంఠుండవో
కనువిందై కనుపింపరావె త్రిజగత్కల్యాణరమ్యాకృతీ.
నీపాదమ్ములు మోముల న్నిలుపుచు, న్నీపాటలే పాడుచున్‌
రేపున్మాపును నిన్‌ దలంచికొనుచు న్నీ పేరుగా నింటిలో
దీపంబెత్తుచు నేటికోళ్ళిడుదు రింతే; నేఁడు నీ కొండపై
రూపుం జూడఁగవచ్చినారు శరణార్థుల్‌ మోముజూపింపవే.
వేంకటసామి, కొండపయివేలుపు, భక్తులపాపపంక మి
ఱ్ఱింకుల నింకఁ జేయఁగల యేలిక దాసజనమ్ము కోరికల్‌
కొంకక నాల్గుచేతులను కొల్చి యొసంగెడి దాతయంచు నీ
వంకకుఁ బుట్టెడాసమెయిఁ బర్విడివచ్చిరి తల్పు దీయవే!
గంగానమ్మల, బీరుసాహెబుల, నంకమ్మల్‌ మదార్సాహెబుల్‌
బంగారమ్మల, మద్దిరామముల, మాలక్ష్మమ్మలన్‌, బోతురా
జుం, గొంతెమ్మల గొల్చు వీరి కెదలోఁ జూపట్టి నీ ప్రాపుజే
రంగావచ్చిన యీ ప్రపన్నులకు దీరా మోము చాటయ్యెదే!
తొంటిభవంపు బున్నెములు దోడుఁగ బుట్టిన భక్తకోటి, నీ
వంటివిభుండు దైవమును, బంధువు లేఁడన విందు నున్కిఁగ
ఱ్ఱంటనిబీళ్ళు వీరి హృదయమ్ముల నాటిన బత్తివిత్తనాల్‌
పంటకు వచ్చె, నేఁటి; కిఁక బళ్ళికలెత్తుము తోలెఁ బయ్యెరల్‌.
కొండికనాఁడు ముజ్జగము గొల్చిన నీ చరణద్వయమ్ము నె
న్నండొ యొకప్పు డీహరిజనమ్ములు గొల్చుట కేకసాక్షియై
యుండఁగఁ బాదుకాద్వయి; అయో! యిపు డూడిగ మొల్లనందువే
వెండియుఁ గొల్చుకొందురిడవే! కయిసేతురు క్రొత్తపాదుకల్‌.
కొండల లోయలన్‌ దిరిగి కోనలఁ గ్రుమ్మరి, తమ్ముగుఱ్ఱతో
నండజయానతో నడవులం దటు ద్రిమ్మరి బొబ్బలెత్తెనో?
పుండులు పడ్డవో చరణముల్‌, త్రిజగచ్ఛరణమ్ము లోదయా
మండన! వీరి కిమ్ము పదమండన దాస్యము చారితార్థ్యమున్‌.
సుమసుకుమారముల్‌, సులభ సుందరముల్‌, జగదేకమోహవి
భ్రమములు, నబ్ధిజామృదులపాణిసరోరుహసేవితమ్ము, లా
క్రమిత త్రివిష్టపమ్ములు, పురాభవ మత్కృతపుణ్యభోగభా
గమ్యములు, విలోకనోత్సవములై చరణమ్ములు మమ్ము నేలుతన్‌.
హరి! గోవింద! రమామనోరమణ! శేషాహార్మ్యశృంగాగ్రమం
దిర! మాణిక్యకిరీటకాంతినిచయాంధీభూతసప్తాశ్వ! పా
ద రజోలేశ విధూత ఘోరకలి సంతాపా! కృపాపాంగ నీ
చరణమ్ముల్‌ శరణాగతాభయకళా సర్వస్వముల్‌ చూపవే.
ఎన్నేండ్లాయెనొ కొండపై వెలసి సామీ! నీవు నిత్యమ్ము నా
పన్నుల్‌ వత్తురు, నీవు నిత్తువుగదా భద్రమ్ము; లీనాఁటిద
న్క న్నీవాకిలి ద్రొక్కి, యీ హరిజనుల్‌ కైసాచిరే? వీరలం
జిన్నంబుచ్చుట దొడ్డవేలుపుల కిస్సీ వన్నెయో, వాసియో!
ఒరగంబండిన పంటచేలఁ గనరా, వుర్వీశ్వరాస్థానముల్‌
జొఱఁబో, వంగడిబేరసారములలోఁ జూపట్ట, వీయంత్రమం
దిరనిర్ఘోషలలో వినంబడవు, తండ్రీ! వీరి పాలింటి కీ
గిరిశృంగమ్మునఁగూడ లేవయితివే, కీడెంచి మేలెంచవే!
వరడులు గంకగృధ్రములు వాయసముల్‌ చెరలాడు నిచ్చమై
కొఱవులు బూని శాకినులు గ్రుమ్మరు నెత్తుటివఱ్ఱు లోడఁగాఁ
బుఱియలు దేల మొండెములు మున్కలు వెట్టఁగ వల్లకాళ్ళుగాఁ
బరగిన పంటజేలఁ బెనుపాపము పండెడు నిద్రమేలుకో.
నేలపయిన్‌ జలమ్ములను నింగిదెసన్‌ బెడబొబ్బవెట్టుచున్‌
గాలకరాళవక్త్రము లకాల మహాశనిగోళపాతనా
భీలములై, జ్వలద్వికృతవేషము లీ పెనుభూతముల్‌ పవల్‌
రే లొకమైఁ జరింప నిదురించెదవే పదిలమ్ముగా గుడిన్‌.
కావిరి దిక్కులం దలమె, క్రవ్యభుజుల్‌ ప్రబలాట్టహాసవై
రావముఖుల్‌ పురమ్ములను గ్రామములందు కపాలహస్తులై
త్రావుచు నెత్తురుల్‌ వికట తాండవకేళి యొనర్తు; రిమ్మెయిన్‌
గోవెలలోనఁ గన్మొగిచి కూరుకుచెందకు మో జగత్పతీ!
కమ్మని పాయసాన్నములు, కస్తురిపూతలు, కప్పురంపు దీ
పమ్ములు, బున్గుధూపములు, పైడినగల్‌ జలతారు పట్టుబు
ట్టమ్ములు నిత్యభోగము లొడంబడి నీవిటు కొండకొమ్ముపై
నెమ్మది నున్నచోఁ గడువు నిండునె సాదకుఁ గూటిపేదకున్‌?
చీఁకటి కొంపలో బ్రదుకు, చింకితలల్‌, మెయిఁ గాటిఁపాతఁ పె
ల్లాఁకటి కింత సంకటియు నంబలియున్‌, జవి కింత యుప్పుగల్‌
వేఁకటి కింత చప్పిడియు, వేఁకికిఁ బస్తులు నైన వీరిపై
నీ కరుణాకటాక్షరస నిస్సరణమ్ములు పొంగిపారుతన్‌.
భయమే యీగిరిమీఁద నిన్‌ నిలిపె, నాపన్మగ్నులే వచ్చి నీ
దయ రొక్క మ్మిడి విల్తు, రేమిపుడు ప్రత్యక్షప్రమాణాగమా
ధ్యయనాగారములందు తేల్చితిమి నీ తత్త్వమ్ము నెల్లంత; వెం
కయసామీ! తొలినాళ్ళఁబోలె నిఁక సాగంబోవయా భోగముల్‌.
ఆలం గాచును, క్షీరముల్‌ పిదికి నీ కర్పించు; ముక్కారులున్‌
జేలం బైరులు పెంచు, నీ గరిసెల న్నిండించు ధాన్యమ్ము; లి
ట్లాలుం బిడ్డల కొక్కప్రొద్దు లిడి, ని న్నర్చించు ముప్ప్రొద్దు; ప్రా
ల్మాలం డెన్నఁడు మాలఁ డాతనికి నేలా మోముఁ జూపింపవో.
తిన్నాఁడొ పస్తులేయున్నాఁడొ, ముప్ప్రొద్దు గుడువఁబెట్టును నీకుఁ గడుపునిండ
కట్టెనో మై గోచిపెట్టెనో, దువ్వలువలు దెచ్చి నీకిచ్చుఁ దలకు మొలకు
నీరాడెనో ధూళిపారాడెనో, సుగంధి నీరమ్ము లార్చు నిన్‌ రేపుమాపు
ఎండెనో తడిసెనో, ఎండవానలు సోఁకకుండ నీకిడు గుళ్ళు గోపురములు
నేఁడుకాదుగదా యితం డూడిగమ్ము సలుపు, టొకనాఁడుఁ గోరిక దెలియనడుగ;
వడుగవచ్చిన గుడి దూరి గడియవైచి కూరుచుంటివి కొండెక్కి గొప్పదొరవు.
అల్లదిగో! రమారమణు నంఘ్రిసరోజయుగమ్ము కౌతుకో
త్ఫుల్ల విలోకనమ్ముల కపూర్వమహోత్సవ మయ్యె రారయా
పిల్లలు పాప లాల్మగలు వృద్ధులు నోహరిజన్ములార! కో
కొల్లలు పున్నెముల్‌ కొలుచుకొండు భవమ్ములు నిండిపొర్లగన్‌.
పూచిన కల్పక ప్రసవముల్‌ తొలిబాముల నోచి యీగుడిన్‌
దాచిన పంట, లీ హరిజన స్థిర తీవ్ర దిదృక్షు లోచనా
సేచనకమ్ములై, నిఖిలసేవ్యములై, పతితావనమ్ములై,
శ్రీచరణమ్ము లెంత విలసిల్లెనయా! దయయన్న నీదయా!
నీ పాదమ్ములు పున్నెపుం గనులు మున్‌ వీక్షింప రివ్వారలున్‌
పాపధ్వాంత తదుత్తమాంగములపై భద్రాయితమ్మైన నీ
చూపున్‌ వ్రాలదు మున్ను; నేఁడుకదె! నీ చూడ్కుల్‌ తదీయేక్షణా
లాపోవన్‌ జరితార్థతం గనిన వన్నా! వేంకటాద్రీశ్వరా!
చలువల పాదులై, సిరుల జాలయి, పాపము జోపు దూపులై
కలువల విందులై, బ్రదుకుగానలఁ దీర్చిన బాటలై, కనుల్‌
గలుగుటకున్‌ ఫలమ్ములయి కట్టెదుటన్‌ గనుపట్టు శ్రీపద
మ్ములు తొలినాటి నేఁటి యఘముల్‌ విదళించుత మస్మదీయముల్‌.
బత్తికొలంకులై నెనరు పాఁతున నిల్కడ జెండి, సుంతపో
టెత్తిన కౌతుకమ్ము మెఱుఁగేచిన వీచికలల్ల అల్లదే!
క్రొత్తదలిర్చె నీలమణిరోచిరుదాత్త భవత్పదాబ్జ సం
పత్తికిఁ దావలంబులయి భాసిలు భక్తజనావలోకముల్‌.
తెలతెల వేగెడున్‌ దెసలు తెమ్మెర లల్లలనార్పఁగా వన
స్థలములు కమ్మతావి వెదఁజల్లుచు విచ్చెను నేత్రకుట్మల
మ్ములు, తొలిమెట్టపై నడుగుమోపెఁ ద్రయీమయుఁ డండజాతముల్‌
వెలువడె గూండ్లు లోకములు వేచెడు దేవరపాదసేవకై.
ఎఱకల్‌ సాచి చరించుఁ బక్షు లెరకై, ఏతాములం దోటకాఁ
పరి నీళ్ళెత్తెను, గొండరాళ్ల బయిడిన్‌ బండింప నాగళ్ళు ప
న్నిరి కాపుల్‌, పటుమానసాలయములన్‌ దీపాంకురారాధనల్‌
గురువుల్‌ సేతురు విశ్వమెల్ల గుడి మాకున్‌ నిన్నుసేవింపఁగన్‌.
ఆలుంబిడ్డల ప్రోపులోఁ గలవు, రోగార్తోపచారమ్ములో
జోలల్‌వాడుచు నిద్రపుచ్చుటలలో శోకాపనోదమ్ములో
నాలం గాచుటలో, బుభుక్షకిడు నాహారమ్ములో, కట్టియల్‌
వ్రీలంగొట్టెడి వ్రేటులో గలవు నీ వృత్తమ్మ కా సర్వమున్‌.
కసవున్‌ జిమ్మెద, నీరు జిల్కెదను నీ కల్యాణగేహాన, బా
నసముం జేసెద, గట్టియల్‌ విరుతు, గింజల్‌ పొట్టువో దంచెదన్‌
కుసుమాన్నంబులు వార్చి నీ కిడెద, నంట్లుం దోముదు\న్‌, వీవన\న్‌
విసర\న్‌, బాదము లొత్త నాకిడవె తండ్రీ జన్మ జన్మాలకు\న్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - guDigaMTalu - kATUri vEMkaTESvararAvu - Gudigantalu Gudi Gantalu Gudi Ghantalu - Katuri Venkateswara Rao ( telugu andhra telugu literature )