కవితలు పౌలస్త్య హృదయము కాటూరి వేంకటేశ్వరరావు
కృతిసమర్పణము
ఇరువదేండ్లాయెఁ బౌలస్త్యహృదయమును ర
చించి, గుడిగంటలం జెప్పి చెల్లెఁ బదియు
నైదు వర్షము, లొక పద్యమైన మరలఁ
జెప్పినది లేదు; కవినంట సిగ్గుగాదె?
ఇంక నే గృతు లల్లుట యిల్లగాన
ఈ కృతులు రెండు స్వర్లోకమేగినట్టి
యన్నకున్‌ రామకృష్ణయ్య కంకితమ్ము
సలుపుదుఁ పితౄణభారమ్ముఁ దలఁగు పొంటె
నేరఁడు మంచిచెడ్డలు, గణింపఁడు గీమునఁ గష్టసౌఖ్యముల్‌
వీఱిఁడియై సదా తిరుగు వీఁడని రోయక, నన్ను, మత్ప్రజన్‌
గూరిమి నోమె; అగ్రజునకుం దుదకిచ్చితి నిష్ఠురాగ్నిసం
స్కారము; నింక నా యొసఁగఁ జాలిన దొక్కకృతి ప్రదానమే
ఆలుంబిడ్డలు, పైరుపచ్చ లనకే 'యాగమ్మకాకిం'బలెన్‌
గాలిచ్చందిరుగాడు దుర్వ్యసని, నాకై యెంత చింతించెనో
లోలో; నెన్నఁడు నొవ్వనాడఁడు, దయాళుండై ననుం బ్రోచె; స
చ్ఛీలుం డన్నకు నీకృతిద్వితయమున్‌ జేమోడ్చి యర్పించెదన్‌.
నా తమ్ముండు కవిత్వ మల్లునని యెన్నండైన మాయన్న సం
ప్రీతిం జెందెనొ లేదొ నేనెఱుఁగఁ; దద్వేతృత్వ మూహించి నా
కైతల్‌ సిగ్గిలు; నైన వాని ఋణ మీఁగన్‌ వేఱలేమిన్‌ దయా
ఖ్యాతుండైన మదగ్రజన్మునకు నీ కబ్బమ్ము లర్పించెదన్‌.
పౌలస్త్య హృదయము
(శ్రీరాముఁడు లంకపై నెత్తివచ్చుట చూచి
సముద్రుఁడు రావణునితోఁ జెప్పఁబోగా
రావణుఁ డనిన మాటలు)
నురుఁగుల్‌ గ్రక్కుచు నూర్పుసందడులు మిన్నుల్‌ ముట్ట నొక్కుమ్మడి\న్‌
బరుగుల్‌ ద్రొక్కుచు శీర్ణకేశముల నుద్బాహుండవై వచ్చు త
త్తఱమున్‌ గాంచిన నుత్తలంపడెడిఁ జిత్తం బీ భయోద్వేగ మె
వ్వరిచే నీ కొనఁగూడె నర్ణవపతీ! వాక్రుచ్చవయ్యా! వెస\న్‌.
భ్రుకుటి మాత్రముచే మూఁడు భువనములకు
విలయము ఘటించు జగదేకవీరుల మఁట!
నీకు మద్బాహువింశతి, నాకు నీదు
వీచికాకోటి యఁట కోట! వెఱ పిఁకేల?
నాకు న్నీకు భయం బఁటన్న నుడి యెన్నండైన విన్నామ? నేఁ
డీ కంపమ్మునకు\న్‌ గతమ్ము కనరాదే! సుంతయు\న్‌; భాస్కరుం
డేకాకారత వెల్గు, వాయువును మున్నె ట్టట్టులే వీచు, లే
దే కల్పాంతపయోదగర్జ, కనరాదే తారకల్‌ రాలుటల్‌.
చంద్రహాసము నా చేయి జాఱలేదు
ఔర్వశిఖియు నీ జఠరమం దాఱలేదు
సజ్యకార్ముకుఁడై రామచంద్రమూర్తి
శింజినీటాంకృతియు నింత సేయలేదు.
ఎట్లు! చెప్పవు? రాఘవుఁడే!! మఱేల!
విడువు కంపము, త్రోవ రా విడువు మతని
కనుజ సౌమిత్రితో, సూర్యతనయుతోడ,
హనుమతోఁ, దరుచరవరూథినులతోడ.
ఎన్నాళ్ళకు! ఎన్నాళ్ళకు!
కన్నులు వింశతియు నాకుఁ గల్గినఫల మా
సన్నమయి వచ్చె! భుజ గ
ర్వోన్నతి చరితార్థమగు ముహూర్తము వచ్చె\న్‌.
నాఁటికి నేఁడా? తలఁపున
నాటెను సామికి వికుంఠనగరోదితమౌ
మాటలు; దీర్ఘవిలంబము
వాటించి విభుండు నన్ను వంచించెఁ గదే!
పాతాలాధిపుతోఁక ద్రొక్కితి, శచీ ప్రాణేశు కైశ్యమ్ము డా
చేతం బట్టితి, వెండికొండ శివుతో శీతాచలేంద్రాత్మజో
పేతం బల్లలనాడఁ జేసితిఁ గదా! యీ విశ్వవిక్షోభ మే
లా తప్పింపఁడు సామి నన్నెఁఱిగి? మేలా నన్ను వంచించుటల్‌.
"శివకోదండముఁ ద్రుంచె, సీత వరియించె\న్‌ రాముఁ" డన్నప్డె మా
ధవు కార్యం బనుకొంటి, భార్గవభుజా దర్పాపహార క్రియా
శ్రవణంబు\న్‌ సరిదాకఁగా, దినము వర్షంబైన యుత్కంఠచే
నవివేకమ్మునఁ గన్ను గాన కటు ద్రోహారంభము\న్‌ జేసితి\న్‌.
"దేవి! జానకీ! యెచటనే దేవి!" యనుచు
దండకాటవి నెల్గెత్తి తరుల గిరుల
నెమకి, మృగముల ఖగముల నిలిపి యడిగి
యుఱక వాపోయెనఁట! నన్ను మఱచి విభుఁడు.
తమ్ముఁగుఱ్ఱమూపునఁ గేలుఁదమ్మి మోపి
ఉబుకువక్షమ్ము బాష్పమ్ము లొలుకుకనులు
నగుచు నాతండ్రి యార్తిమై నడలు నాఁటి
జాలిరూపు నా మోమున వ్రేలు నేఁడు.
పుడమి కానుపు నే నట్లు పుడికి తెచ్చు
టలు జటాయువుచే విని, విలులితాశ్రు
కలుషిత కపోలములఁ గెంపుదొలుకఁ గ్రోధ
ముద్రితాననుఁడై రామభద్రమూర్తి
'రావణా!' యని నన్నుఁ బేర్వాడి ప్రతిన
సలిపినపుడుగదా మనశ్శాంతి దొరకె.
పదుగురలోన న\న్‌ గుఱుతు పట్టునొ లేదొ యటంచు సర్వభూ
విదితపరాక్రముండ నయి వీఱిడిసేఁతలు పెక్కు చేసితి\న్‌
బదుగురు 'వీఁడు రక్కసుఁ'డన\న్‌ వెడనిందల కగ్గమైతిఁ, దా
మదిమదినుండి న\న్‌ మఱచె మాధవుఁ డెంతటి క్రూరచిత్తుఁడో!
మునుల హింసించుటలు నాకు మనసొ? సతులఁ
జెఱనిడుట కేను బశువునో? సెప్పు మీవె!
ఇటులు దాను నృశంసుఁ జేయుటలుగూడఁ
బ్రభువునకు వినోదమైనఁ గావచ్చు; దాస
జనగవేషణాయాసము దనకుఁ గూర్చు
క్రూరకర్మము మాత్ర మే నేర నిజము
ఇంతజేసినఁగాని నా కించుకంత
మంచి దక్కఁగ నీఁడాయె మాధవుండు;
సాగరా! ఏమి వచియింతు? జానకమ్మ
తల్లినే హరియింపక తప్పదాయె.
స్వామి ద్రోహముకూడ నేర్పెఁ దుదకు\న్‌ వైకుంఠుఁ డౌరౌర! తా
నేమో నా కిడు బాస లోఁ దలఁపఁడాయె\న్‌ గ్రుడ్డిలోకమ్ము త
న్నే మెచ్చె\న్‌, దొసఁగెల్లఁ జాల్పుదలల\న్‌ నిల్పె\న్‌, మహాంభోనిధి
స్వామీ! మర్త్యుల రాజనీతి నిపుణత్వం బెల్ల విన్నావుగా.
ఉట్టిగట్టి యిచట నూరేగనుంటినా
యేమి? లోకభీతి యేల నాకు?
దక్కనిమ్ము మంచితన మెల్ల విభునకే,
అతఁడు నన్నెఱుంగు టదియ చాలు.
ఎల్ల యెఱిఁగియుండి యేమి నెరుంగని
యట్లు హరి చరించు నప్పుడప్పుడు;
ఎఱిఁగియెఱుఁగలేక యే నక్కటా! భూమి
పుత్రి నపహరించి మోసపోతి.
ఇంత నున్నయప్పు డీ మాయనటనముల్‌
లేవు కేశవునకుఁ; గేవలుఁ డయి
దర్శన మ్మొసంగు తండ్రి నే నెఱుఁగనే!
మాయదారి యయ్యె మహికి డిగ్గి.
తనదరి కేను రాఁదగిన దారుల నన్నిటి మూసి యుంచిన\న్‌
మనమున నోర్చి, న\న్‌ దరియు మార్గము లన్నిటి విప్పియుంచి, రా
వణ భయదాంఘ్రిముద్ర కనుపట్టని సూదిమొనంత నేలయు\న్‌
దనకు మిగుల్ప నైతిని కదా! విభుఁ డేటికి జాగుచేసెనో?
కల సకలాధ్వముల్‌ మదభిగాములు గావు టెఱింగి భ్రాంతిమై
నిలుచునొ పాలువోవ కని నిక్కపుమార్గ మొకండె చేసితి\న్‌;
తొలఁగని రాచబాటగద తొయ్యలి నేఁ గొనిచన్నదారి, న
న్నలమట బెట్టిన\న్‌ విడుతునా? తన మాయలు చెల్లనిత్తునా?
రావణుఁ డన్నఁ గాళ్ళఁబడు రాయియు ఱప్పయుఁ గాదు, జాలిమైఁ
గావఁగ నాఁతి కోఁతియును, గాకియు గ్రద్దయుఁ గాదు, లోక వి
ద్రావణుఁ డుగ్రవీరచరిత ప్రథితుం డతిమానియౌ దశ
గ్రీవుఁడు పోరిలోఁ బొడిచి గెల్చును జచ్చునుగాక, వేఁడునే?
చూడుము నెచ్చెలీ! విభుఁని జూచితివేకద! చెప్పు మెట్టు లు
న్నాఁడొ రఘూద్వహుండు, లలనా విరహవ్యధఁ గ్రాఁగి చిక్కియు
న్నాఁడొ? దశాస్యకంఠదళన ప్రవణాగ్రహవృత్తి వెల్గుచు
న్నాఁడొ? అధిజ్యధన్వుఁ డరుణద్యుతిరంజిత నేత్రకోణుఁడై.
వింటిని మారీచునిచే
వింటిని శూర్పణఖచేత, వింటి హనుమచే
వింటిని జనకాత్మజచే
వింటిని రఘువీరు బాహువీర్యకథనముల్‌.
వసవల్చు చెక్కిళ్ళ వయసున లజ్జమై మునియాజ్ఞఁ దాటకఁ దునుము సొగసు
జునపాలు వ్రేలు నీడున శైవచాపమ్ముఁ విఱిచిన శృంగారవీరమహిమ
పసపుబట్టలనిగ్గుపస భార్గవక్రోధ సంధ్య మాయించిన శౌర్యసార
మాలిఁ బాసిన క్రొత్తయలఁతమై వజ్రసారుని వాలి నొకకోలఁ దునుము పటిమ
వింటయేకాని ఇన్నిటికంటె, రాచపట్టము దొరంగి, నారలు గట్టి కాన
మెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము వింటి; సామికే తగుననుకొంటెగాని.
శ్యామలకాంతి మోహనము సౌమ్యగభీరము సుప్రసన్నరే
ఖామృదుహాసభాసురము గన్నులపండువునైన రాము నె
మ్మోమును మిమ్మువోలెఁగన నోమనుగాదె; కఠోరవృత్తినై
సామిని మున్నె ఘోరరణసత్ర నిమంత్రితుఁ జేసియుంచుట\న్‌.
వినుము, దశకంధరుని విశ్వవిజయకీర్తి
దర్పణంబయి తళతళత్తళ వెలుంగు
చంద్రహాసమె శ్రీరామచంద్రునకును
నాకు ఘటియించుత మిథోవలోకనమ్ము.
తోయధీ! ధన్యుఁడవు నీవు, తొల్లి మత్స్య
కమఠరూపత నీదె నీగర్భము హరి,
నేఁడు వెండిఁ దరింపనున్నాఁడు నిన్ను,
నెల్లి నినుఁ జేరి పవళించు నేమి యెఱుఁగ
నట్టులు తరంగలాలితుం డగుచు శౌరి.
అగుదురు మిమ్ముబోంట్లు చరితార్థులు, కాదనఁగాని, మోము ము
ద్దుగొనిన తండ్రికంటె, దయతోఁ జను గ్రోల్చిన తల్లికంటె, మై
సగమగు సీతకంటెఁ, బరిచర్య లొనర్చిన తమ్ముకంటె నీ
జగదభిఘాతి రక్కసుఁడె సామికి మిక్కిలిఁ గూర్చు నెచ్చెలీ!
తల్లి దండ్రి యాలు దమ్ముండు మొదలు మీ
కెల్ల లంకె వైచె వల్లభుండు;
వల్లభునకు నేనె వైచితిఁ బెనులంకె
నొరు లెఱుంగ రిద్ది పరుఁడె యెఱుఁగు.
ప్రియదర్శనుఁడై శ్రితుల క
భయముద్ర ధరించు సర్వభద్రుని భయవి
స్మయకారి విలయసమయా
ద్వయభావం బన్యదుర్లభము నేఁ గందు\న్‌.
ఎంచిచూడ జానకి హరియించు టెంత
మంచిపని యయ్యె! స్వాత్మ కిమ్మాడ్కిఁ దొల్లి
ఎవ్వ రపచార మొనరించి? రెవ్వరికిని
దొరకని యగాధతలములు దొరకు నాకు.
పోరు లెఱుంగఁడో, దనుజ పుంగవుల\న్‌ మధుకైటభాదుల\న్‌
జీఱి వధింపఁడో, కిటినృసింహ ముఖాకృతుల\న్‌ ధరింపఁడో,
గౌరవ మిట్లొనర్చె దశకంఠున కీ పురుషోత్తమాకృతి\న్‌;
శౌరి కపూర్వవిక్రమరసమ్మునఁ బారణ సేయఁగావలె\న్‌.
పతిభిక్ష\న్‌ శచి కిచ్చి, గుహ్యకపతి\న్‌ బంధించి, కైలాస ప
ర్వతము\న్‌ బాఁతగలించి, కంఠదళనారంభమ్ముచే నీఁశు ద
ర్పితుఁ గావించినయట్లుగాదు; మురవైరి\న్‌ శ్రీశు నాత్మేశు న
ర్చితుఁ గావించెడి మేటిపండు విదె వచ్చె\న్‌ జంద్రహాసాసిరో!
స్వీకృత వీరవ్రత పరి
పాకము వైరానుబంధఫలసిద్ధి యిదే
నైకరణప్రణయిని! యెటు
కాకుత్స్థున కాజిభిక్ష కల్పించెదవో!
లేదు పతంగవాహనము; లేవు కరంబులఁ బాంచజన్య కౌ
మోదకులు\న్‌, సుదర్శనము పూనఁడు, రావణు గెల్వవచ్చె దా
మోదరుఁ డెంత నేరుపరియో! పదిజంటలచేతులార! ఆ
కైదువు లాజివేళ హరికైకొనుమాడ్కిఁ బరాక్రమింపుఁడీ.
ఒంటి విలుకాఁడవై నన్నునోర్చు తెగువ
వలదురా! రాఘవా, రాఘవా! దశాస్యు
నక్కటా! క్రూరవిక్రము, స్వాత్మహనన
పాతకుని జేయకుముర! నీ పాదమాన!
చిర విరహాగ్నిఁ గ్రాఁగు నడచిచ్చుల గుండమువోలె బగ్గుబ
గ్గు రనెడి చేతు లిర్వదిటఁ గూరిచిపట్టి, దశాస్యమండలి\న్‌
దరికొని రావణాగ్ని బహుధా దహియింప, సవాంతమందు దా
శరథియె పంక్తికంధరుఁడొ శాశ్వతభావము గాంచుఁ గావుత\న్‌.
పొమ్ము నెచ్చెలి! రామమూర్తికి నెదురేగి పుట్టుముత్తియముల మ్రుగ్గు వెట్టి
అత్యున్నతమ్మును నతిగభీరమ్మైన గర్భవీచిమతల్లి గద్దె వెట్టి
రమకంటెఁ గౌస్తుభరత్నమ్ముకంటె గారామైన మణులు దర్శన మొసంగి
లంకకుఁ బంపు, పౌలస్త్యుండు సిరికొల్వు చవికయౌ వక్షమ్ము చంద్రహాస
దారిత మొనర్చి, ఆ గంటుదారివెంట హృదయము\న్‌ జొచ్చి, యేకాంత మిచ్చగించి
స్వాగతముఁ బల్కునని విన్నపమ్ము సల్పు మచటనే పునర్దర్శన మగుత మనకు.
AndhraBharati AMdhra bhArati - kavitalu - paulastya hR^idayamu - kATUri vEMkaTESvararAvu - Paulastya Hridayamu - Katuri Venkateswara Rao ( telugu andhra telugu literature )