| కవితలు | కిన్నెరసాని పాటలు | కిన్నెర దుఃఖము |
| 7. కిన్నెర దుఃఖము |
|
హా యని కిన్నెర యేడ్చెన్ తన మనోహరుడు శిలయైనా డని తా నేమో యీ వాగైనా నని హా యని కిన్నెర యేడ్చెన్ |
|
ఊగులాడు కెరటాల నాపుకొన సాగులాడు తరగల్లు నిల్పుకొన ప్రాకిపోవు తనగుణము చంపుకొన చాలక చాలక చాలక చాలక హా యని |
|
తన తొందరయును తన పతి ప్రేమయు తాను చేసినా తెలివితక్కువయు తన పతి చూపిన త్యాగగౌరవము తలచుకు తలచుకు బోరున బోరున హా యని |
|
ఏడుపు నిప్పుక లెగసి చిమ్ముకొని ఏటి నీరముల నెండగట్టుకొని చేటు తప్పిపోయేటిరీతిగా బాట యేల కనరాదని రాదని హా యని |
|
చుక్కనైతె యీ బెడద తప్పునే మొక్కనైతే యీ వగపు తప్పునే అక్కట నా చెలువునిదెస చేసిన యిక్కలుషము నే దాటు టెట్టులని హా యని |
|
కడలి లోకముల నేలేరాజట కడలి ధర్మములు నిలిపే దొరయట కడు పతివ్రతల కవయ నెంచుటలు కడలికి తగునా తగునా యిట్లని హా యని |
|
అతడు మంచివాడే యగునేమో సతి వాగై ప్రవహించిన దం చన అతనికోసమే అయిన దటంచును మతి తలపోయుట తప్పెట్లగు నని హా యని |
|
ఏడ్చి ఏడ్చి జలమెల్ల నెర్రనయి ఏడ్చి ఏడ్చి తనువెల్ల నల్లనయి ఏడ్చి ఏడ్చి నురుసుల్లు తెల్లనయి ఏడ్చి ఏడ్చి నడకల్లు వేగమయి హా యని |
|
బొట్టు బొట్టు కొక వేయియెదలుగా తరగ తరగ కొక వేయినోళ్ళుగా బడలి నీరమే యేడుపుమయమై కడలిమ్రోత లెక్కుడు భయమిడగా హా యని |
|
గాలిపొరలలో కదలాడినవో అడవిచెట్లలో అణగారినవో వెలుగు దారులను విచ్చిచొచ్చినవో కిన్నెర ఏడుపు సన్నని యెలుగులు హా యని |
|
కిన్నెర యేడుపు సన్నని యెలుగులు విన్న యడవిలో చిన్ని పులుగుగమి కిన్నెరతో పాటుగ గొంతులలో సన సన్నని యేడ్పులు జాలు వార్చగా హా యని |
|
శిలయైన పతిం దెలచిన గాలులు మెల మెల్లగ తన తరగల నూగగ చలచల్లన ప్రాణమ్ములు తేరగ తలచిన కొలంది దుఃఖము పొంగగ హా యని |
|
క్రొత్తవాగు పరతెంచి వచ్చె నని క్రొత్తతోగు పరతెంచి వచ్చె నని క్రొత్త క్రొత్త యాబాలనీరములు క్రోలగ వచ్చిన పులులు దిగుల్వడ హా యని |
|
ఎక్క డెక్కడీ మృగములు వచ్చెను ఎక్క డెక్కడీ పులుగులు వచ్చెను ఎక్క డెక్కడీ గాలులు వచ్చెను కిన్నెర నోదార్చుటకై పాపము హా యని |
|
కిన్నెర యేడుపు చూచి పులుగులూ కిన్నెర దుఃఖము చూచి మృగములూ కిన్నెర యేడుపు చూచి గాలులూ ఓదార్చగలే కవియు నేడ్చెనూ హా యని |
|
చూడవచ్చినా లేడి కిన్నెరా గాడివారినా యెడదలోపలా వాడి వాడి లేజివురు వత్తలై బేడిస కన్నుల నీరము వెట్టగ హా యని |
|
ఒడ్డునందు కుందేటికూన లవి చిన్ని చెవులు తెగ నిక్కపొడుచుకొని ముందుకాళు లింపొంద నెత్తి యో దార్చలేక తెల్లతెల్ల వోవగా హా యని |
|
గూళ్ళలోన తమ పిల్లల వదలెను మేతకొరకు పోవాలని మానెను అడవి పులుగులూ లల్లల్ల చేరుకుని అడవివాగు నోదార్చవచ్చెనూ హా యని |
|
పికిలి పిట్టలూ అడవి పిచ్చికలు నీటి పులుగులూ నేలపులుగులూ తెగగుమికట్టిన తెలుగు పిట్టలం దొకటి యేడ్చి మఱియొకటి యేడ్వదా హా యని |
|
కిన్నెర యేడుపు సన్నని యెలుగులు మిన్ను మన్ను నడి యెడము నెడమునా చిన్ని వెలుగులో పిన్న గాలిలో సన్న సన్నగా జాలువారగా హా యని |
|
చిన్ని కిన్నెరా సన్నని యెలుగులు పిన్నగాలి కెరటాల చొచ్చునూ ఎన్నడొ వెనుకటి బ్రతుకున మిక్కిలి విన్నవాటివలె విరవిరబోవును హా యని |
|
చిన్ని కిన్నెరా సన్నని యెలుగులు చిన్ని చెట్ల క్రొంజివురు లంటునూ ఎన్న నందనము గున్న మావులం దున్న తుమ్మెదలరొదవలె మొరయును హా యని |
|
పడతి కిన్నెరా ప్రన్నని యెలుగులు అడవి పచ్చికలయందున ప్రాకును అడవి పావురా యెడబాటగ్గికి గుడగుడ గొంతున కూసిన యట్లగు హా యని |
|
అల్ల నల్ల కిన్నెర యేడుపులవి వెల్లివిరిసి గోదావరి కెరటము లల్లలాడు నా నడిమిసందులో మెల్లగ దూరెను మొదలిడు పోలిక హా యని |
|
అల్ల నల్ల కిన్నెర యేడుపు లవి మెల్ల మెల్ల గోదావరి గర్భము వెల్లిలోన చొరబారి మొత్తుకొని గొల్లుమనుచు మొరపెట్టుకొన్నయవి హా యని |
|
గోదావరి యీవార్త విన్నదీ గోదావరినది గుండె కరగినది గోదావరినది జాలి పొందినది గోదావరి కన్నీరు కార్చినది హా యని |
|
గోదావరినది పొంగి వచ్చినది గోదావరి తా నభయ మిచ్చినది గోదావరి కెరటాలు చాచినది గోదావరి రమ్మన్నది కిన్నెర హా యాని |
|
కిన్నెర యెదలో పొంగిపోయినది కిన్నెర యెదలో తాండవించినది కిన్నెర మఱి కన్నీరు కార్చినది కిన్నెర తనకత చెప్పుకున్నదీ హా యని |
|
కిన్నెర తన కెరటాలు తగ్గినది కిన్నెర తన యూగిసల నాపినది కిన్నెర గోదావరి కెరటాలకు చిన్ని యలలు తా నంది యిచ్చినది హా యని. |