| కవితలు | కిన్నెరసాని పాటలు | కడలి పొంగు |
| 6. కడలి పొంగు |
|
గాలిపిల్లలెపోయి వూదెనో మొగిలు కన్నెలుపోయి చెప్పెనో తగని కోరికచేత తనలో కడలిరాజు సొగసు కిన్నెరసాని చూడాలె ననిపించి ఉఱ్ఱట్ట లూగెనూ మిఱ్ఱెక్కి చూచెనూ |
|
మిసమిసని మింటికై పొంగెనూ మసక మసకల కళ్లు విప్పెనూ ఎంత దూరానుందొ యీ చిన్ని పడుచంచు సంతోసమే మేను సకలమ్ముగా మారి మిరిమిర్రి చూచెనూ బొటవ్రేళ్ళ నిలచెనూ |
|
ఉబికి కెరటా లూగులాడెనూ గుబురులై ఉప్పొంగిపోయెనూ తన యొడల్తన కేమొ తెలియ నట్లయిపోయి తరుణి కిన్నెర అందమే లోక మయిపోయి సళ పెళా కాగెనూ గల గలా వూగెనూ |
|
తన నీటిగుణ మెందు పోయెనో తన చల్లదన మెందు దాగెనో పరగ తనలో నున్న బడబాగ్ని శిఖ పొంగి తన శరీరమ్మెల్ల దహియించి నట్లుగా తటపటయి పోయెనూ తపియించి పోయెనూ |
|
గంగ తన యిల్లాలు కాదటే యమున తన యిల్లాలు కాదటే ఎంతమందీ లేరు ఇన్ని యేళ్ళూ వచ్చి చిన్ని వాగులు చూచి చిత్త మెరియించుకో తనకు నిది తగదూ కడలి రాజునకూ |
|
ఏనాటి ముసలి యీ కడలీ ఏనాటి పెద్ద యీ కడలీ తిరిగి నలుగురిలోన తిరుగ నేర్చినవాడు పరగ కామమునకై బడలిపోయె నటన్న తన కేమి పరువూ కడలి రాజునకూ |
|
తన కున్న మరియాద యెంతా తన కున్న గౌరవం బెంతా లోకాలు తప్పుత్రోవల పోవునాయేని సర్ది చెప్పగలట్టి సామంతు డీ రాజు తానుగా దిగెనా తప్పుదారులకూ |
|
అన్ని వాగులవంటి దగునా అన్ని తోగులవంటి దగునా మంచి కిన్నెరసాని మగని కెక్కినచాన కొంచెమేమో పొంది కోపమిట్లయినంత తన్ను పొందునటే తనకు దక్కునటే |
|
వాగుగా తా నెప్పుడైనదో తోగుగా తా నెప్పుడైనదో జలజలా స్రవియించి బిలబిలా ప్రవహించి కడలి రాజు హొరంగు కౌగింటిలో దూరు టపుడె వ్రాసినదీ అన్ని వాగులకూ |
|
అని పొంగిపోయెనూ కడలీ అని వూగులాడెనూ కడలీ తనపైన తారాడు పడవ లల్లలనాడి వచ్చె నంచు తుఫాను భయ మంది కుందగా తెరచాప లూగా కెరటాలు క్రమ్మా |
|
కెరటాలు పొంగినా కడలీ తరగ లూగాడినా కడలీ సొగసు కిన్నెరసాని చూ పందుకొనుటకై గగనమ్ము కొసదాక కెరటాలు వుబికించి దూరాలు చూచెనూ బారలూ చాచెనూ |
|
పొంగి పోయిన కడలి చూచీ మిన్ను ముట్టిన కడలి చూచీ ఈ అకాలపువేళ యేమో కడలి పొంగి పోయెబో లోకాలు ముంచి వేయునో అంచు కళవళం పడెనూ జగము లన్నీనూ |
|
ఊగులాడిన కడలి చూచీ ఉబికి పోయిన కడలి చూచీ ఉప్పు పెనగా వచ్చి ఉర్వి అంతా పొంగి తెప్పలై నేలపై తేలియాడునో అంచు కళవళం పడెనూ జగము లన్నీనూ |
|
అదుగదుగో బాడబము పొంగే అదుగదుగో నేలపై వచ్చె అని మానిసులు పిరికితనముగా చెప్పుకొని మేనిలో ప్రాణాలు బిగియగా పట్టుకొని కదలిపోవరహో ఒకరొకరి వదలిపోవరహో |
|
వచ్చె వచ్చెనటన్న కడలీ ఎంత చూచినను అట్లే నిల్చిపోవగా ఎంతసేపటికి అట్లే నిల్చి ఉండగా పిరికితగ్గినదీ జగము లన్నిటికీ ఎట్లు పొంగిన దట్లు పొంగీ |
|
ఎట్లు నిల్చిన దట్లు నిల్చీ ఒకనీటిబొట్టయిన ఉరలి నేలకు రాక కడలి అచ్చోటనే కదలకుండుట చూచి పిరికి పోయినదీ కొంతసేపటికీ కడలి పొంగిన దంతెకానీ |
|
కడలి ఉబికిన దంతెకానీ కడలి తా చెలియలీకట్ట దాటునె యంచు కడలిమాత్రము బద్దె గడచిపోవునె యంచు కడగి యనుకొనిరీ బుడుత మానిసులూ అన్ని విధముల లోక మాడెనూ |
|
అన్ని రీతుల జగము చెప్పెనూ చిన్ని కిన్నెరసాని చిత్తాన పొగ లెగయు క్రొన్నిప్పుకలులోన కుమిలించి దహియించు టెవ్వ రెఱుగుదురూ నవ్వేటి జనులూ కడలి మిన్నుల తాకు చూచీ |
|
కడలి తరగల వూగు చూచీ కడలి తనకోసమై బడలుపడిపోవు నని కడలి తనపై వలపు కమ్ముకొనివచ్చె నని కిన్నె రెరిగినదీ కీడు తలచినదీ మనసులో పెద్దదిగులుట్టీ |
|
ఎదలోన పెద్దవగ పుట్టీ కదలిపోయెడి నీరు గడ్డకట్టించుకో సాగిపోయెడి నీరు సాగ కింకించుకో బిట్టు కోరినదీ బిట్టు కుందినదీ ఓ నాథ నిను వీడి వచ్చీ |
|
ఓ రాజ నిను వదలి వచ్చీ నా యొడల్సయితమ్ము నానాజనులు కోర యీ యేవపుంబ్రతు కేల పొందితినిరా అంచు వగచినదీ అంచు లురలినదీ అచటనే నిలిచిపో నెంచూ |
|
అచటనే ఆగిపో నెంచూ కాని నీటిగుణమ్ము కదలిపోవునె గాని చాన కిన్నెరకోర్కె సాగించునే తాను జలజలా కదలీ బిలబిలా కదలీ రాయడ్డముగ చేసి నిలుచూ |
|
పొదలడ్డముగ చేసి యాగూ ఇంత నిల్చితి నంచు నెంచి లో నుప్పొంగి పొంత పొంతలరాళ్ళు పొదలు పైపైపొంగి అడవి పరుగెత్తూ అంతలో నేడ్చూ. |