| కవితలు | కిన్నెరసాని పాటలు | కిన్నెర నృత్యము |
| 4. కిన్నెర నృత్యము |
|
కెరటాలలో నుర్వు తెర చాలులో నీటి పొరజాలులో కిన్నె రటు కదలి యిటు కదలి చిటితరంగాలతో పొటితరంగాలతో నటనాలు మొదలెట్టెనే క్రొన్నీటి తుటుములా కదలాడెనే |
|
పువుకన్నెలా జగా రవ నవ్వులా వేల్పు కవ చివ్వలా కిన్నె రటు లూగి యిటు లూగి చిటిలు కెరటాలతో పెటిలు కెరటాలతో జవ్వుజవ్వున నూగెనే తెలిమల్లె పువ్వురువ్వులు పోయెనే |
|
చిఱుగాలిలో నూగు కొఱవంపుతో నీటు తరితీపులో కిన్నె రటు లేచి యిటు లేచి జల్లుతుంపురులతో కొల్లతుంపురులతో మెల్ల మెల్లన నాడెనే కెరటాల జల్లులో ముంచెత్తెనే |
|
నడినీటిలో మేలి జడసందులో నీటి ముడిపొందులో కిన్నె రటు పొంగి యిటు పొంగి రంగారు నలలతో పొంగారు నలలతో చెంగు చెంగున దూకెనే క్రొంగ్రొత్త సింగారములు వొలికినే |
|
సురగాలిలో పొంగు తరగాలిలో నీటి తెరడాలులో కిన్నె రటు పొరలి యిటు పొరలి పరుగెత్తు నురుగుతో దరులొత్తు నురుగుతో గల్లుగల్లున మ్రోగెనే జల్లు మని వెల్లువల్ విరజిమ్మెనే |
|
సొనజారుతూ నీటి పనవాలుతూ అండ మున సోలుతూ కిన్నె రటు చెదరి యిటు చెదరి చిన్నారి నడలతో పొన్నారి నడలతో వన్నె వన్నెలు పోయెనే కిన్నెరా క్రొన్నెలా తళు కొప్పెనే |
|
చిఱు తేనెలా అచ్చ రల గొంతులా గజ్జి యల మ్రోతలా కిన్నె రటు మొరసి యిటు మొరసి గలగలారవళితో జలజలారవళితో మెల్లగా నూగాడెనే కెరటాల జల్లుగా ముసురెత్తెనే |
|
తెగ పాడుతూ అంద ముగ నాడుతూ తేనె వగలోడుతూ కిన్నె రటు వాలి యిటు వాలి తళుకు వాకలతోడ బెళుకువాకలతోడ మలకలై నటియించెనే తెలినీటి పులకలై బుగ్గెత్తెనే |
|
లయ పెంచుతూ మధ్య లయ దించుతూ పాట రయ మెంచుతూ కిన్నె రటు సోలి యిటు సోలి తెలి నీటిమేనితో తలిరాకు మేనితో ఒయ్యారములు పోయెనే కిన్నెరా అయ్యారె యనిపించెనే |
|
ధణధంగిణాం దధోం గిణ తక్కిణాం మద్దె లల మ్రోతలై కిన్నె రటు మ్రోగి యిటు మ్రోగి చిఱు లొల్గుసోనలై సిరులొల్కు సోనలై మృదు తాండవము చేసెనే వనవీథి పదువు పాయలు కట్టెనే |
|
ఘలు ఘల్లునా వెల్లు వల పెల్లునా కొల్ల వలి జల్లునా కిన్నె రటు త్రొక్కి యిటు త్రొక్కి గిలుకు టందియలునా తళుకు టందియలునా అలల నురుసులు తోచెనే ఆమధ్య జలజలా పొంగెత్తెనే |
|
జిగి బెళ్కులా ధగా ధగ తళ్కులా జగా జిగికుల్కులా కిన్నె రటు నవ్వి యిటు నవ్వి అలల పెన్నురుసుతో సెలల పెన్నురుసుతో తెలుగు వొదుగులు పోయెనే కిన్నెరా తెలుగు తీపులు చిమ్మెనే |
|
తెలి నుర్వులో చెమ్మ టలు చిమ్ముతూ అలస టలు క్రమ్ముతూ కిన్నె రటు సొక్కి యిటు సొక్కి చిఱుమీను కనులతో శ్రమ మీను కనులతో సోగతనములు వోయెనే లోగొంతు రాగాలు వెలయించెనే |
|
తమికోనలో మిటా రము క్రక్కుతూ నిగా రము లొల్కుతూ కిన్నె రటు లెగిరి యిటు లెగిరి ననమేని వంపుతో నును మేని ముంపుతో కాలిగజ్జెలు మ్రోగెనే జఱ్ఱు మని క్రాలు కెరటాల్ చిందెనే |
|
అల కోనలో మంచు వలి సోనలో వెల్లు వల వానలో కిన్నె రటు లోడి యిటు లోడి రస మేలు రూపుతో పసమేలు రూపుతో సొగసు వంపులు వంగెనే వెన్నెలా చిగురు మంపులు సూపెనే |
|
తలి రోర్పుతో నీటి యలలూర్పుతో అంద ముల మార్పుతో కిన్నె రటు తూగి యిటు తూగి బిగువు టందాలతో నగవు టందాలతో నిండుగా ప్రవహించెనే పువ్వుల్ల చెండులా చెలు వొలికినే |
|
చిఱురాలపై మిఱ్ఱు లగు నేలపై మెట్ట లగు చేలపై కిన్నె రటు దూకి యిటు దూకి గ్రక్కదలు నీటితో చిక్కువడు నీటితో నీటి గుబురులు కట్టెనే విరిపూల తోటలా తళు కొత్తెనే |
|
తెర పొర్లుతో యీగి కొను మర్లుతో తిర్గి పడు దొర్లుతో కిన్నె రటు తరలి యిటు తరలి పావురా యెలుగుతో తీవలా యెలుగుతో ఒత్తుకొని తరగొప్పెనే తరగల్లు ఒత్తిల్లి తట మొత్తెనే |
|
అడవిలో చిఱుపాయ లై నాకలై సోన లై జాలులై కిన్నె రటు ప్రాకి యిటు ప్రాకి దివ్య నృత్యములతో దివ్యనిస్వనముతో దిగ్దిగంతము లంటెనే సురనదీ దీప్తి దిక్కుల చిమ్మెనే |
|
జిలుగు టందియలతో కులుకు క్రొన్నడలతో వెలది కిన్నెరసాని పలుత్రోవలుగ బోయి తెలిపూల తేనెవాకలు వారగాచేసి తెనుగు వాగై పారెనే నెత్తావి తెనుగు పాటలు పాడెనే. |