కవితలు కిన్నెరసాని పాటలు కిన్నెర నడకలు
3. కిన్నెర నడకలు
కరిగింది కరిగింది
కరిగింది కరిగింది
కరిగి కిన్నెరసాని వరదలై పారింది
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది
కదిలింది కదిలింది
కదిలింది కదిదింది
కదిలి కిన్నెరసాని వొదుగుల్లుపోయింది
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది
ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది
నడచింది కడరాళ్ళు
గడచింది పచ్చికల్‌
తడసి కిన్నెరసాని సుడులలో మొరసింది
జడిసి కిన్నెరసాని కడలందు వొరిసింది
సుడిసి కిన్నెరసాని జడలుగా కట్టింది
కరగగా కరగగా
కాంత కిన్నెరసాని
తరగచాలుల మధ్య తళతళా మెరిసింది
నురుసుపిండులతోడ బిరబిరా నడిచింది
ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది
కదలగా కదలగా
కాంత కిన్నెరసాని
పదువుకట్టిన లేళ్ళకదుపులా తోచింది
కదలు తెల్లని పూలనదివోలె కదిలింది
వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది
నడవగా నడవగా
నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిగా తోచింది
కడుసిగ్గుపడు రాచకన్నెలా తోచింది
బెడగుబోయిన రత్న పేటిలా తోచింది
పతి రాయివలె మారి
పడియున్న చోటునే
పడతి కిన్నెరసాని విడలేక తిరిగింది
ముగుద కిన్నెరసాని వగచెంది తిరిగింది
వెలది కిన్నెరసాని గలగలా తిరిగింది
తాను నదిగా నేల
నైనా ననుచు లోన
పూని కిన్నెరసాని పొగిలింది పొగిలింది
ముక్త గీతికవోలె మ్రోగింది మ్రోగింది
ఒకచోట నిలువలే కురికింది వురికింది
ఏ వుపాయము చేత
నైన మళ్ళీ తాను
మనిసి కిన్నెరసాని నగుదామ యనిపించి
ఆపలేనంత కోరికచేత విలపించి
ముగుద కిన్నెరసాని మొరసింది మొరసింది
తను వీడితే వోర్చు
కొనలేడు కాబోలు
బ్రతికుండగా యింత ప్రణయమ్ము కలదంచు
తెలిసితే యింకెంత చెలిమివుండేదంచు
తలపోసి తలపోసి సొలసె కిన్నెరసాని
అటువంటి పతితోడి
అటువంటి కాపురం
బిటు చేసికొంటినం చెక్కడా లేనంత
వగచెంది వగచెంది వనిత కిన్నెరసాని
వనరింది వనరింది వనిత కిన్నెరసాని
తుదకేమి చేయగా
నెదవోక అలవోక
పతి రాయిగా మారి పడియున్న గుట్టపై
అతివ తన కెరటాల హస్తాలతో చుట్టి
వెతపొంది వెతపొంది బిట్టుఘోషించింది
మాటి మాటికి కొండ
మాద్రిగా పడివున్న
తన నీటుకాణ్ణి చేతుల కౌగిలిస్తుంది
పలకవా యని మ్రోతపడి పల్కరిస్తుంది
పతిగుట్టపై తాను వ్రాలి యేడుస్తుంది
ఓనాథ ఓనాథ
ఓనాథ ఓనాథ
నాకుమల్లే నీవు నదివోలె పారరా
జలముగా యిద్దరము కలిసి పోదామురా
కెరటాలు కెరటాలు కౌగిలిద్దామురా
ఓనాథ ఓనాథ
ఓనాథ ఓనాథ
నీయందు తప్పింక నేను చెయ్యను లేర
ఆనపెట్టితి వేని అడుగుదాటను లేర
ఇక జన్మలో కోపమింత పొందను లేర
రార ఓహో నాథ
రార ఓహో నాథ
వెలది నీ కిన్నెరా కలగిపోయిందిరా
నాతి నీ కిన్నెరా నలగిపోయిందిరా
పడతి నీ కిన్నెరా బడలిపోయిందిరా
ఓనాథ నీయందు
నేను చేసిన తప్పు
తిరిగి యెప్పటికైన తీర్చుకుంటానురా
నీత్రోవ నీదిరా నాత్రోవ నాదిరా
మరల నాతో నీవు మాటాడబోవురా
పిలిచింది పిలిచింది
పిలిచింది పిలిచింది
పిలిచి కిన్నెరసాని పిలుచు టాపేసింది
బడలి కిన్నెరసాని పడిపోయినట్లైంది
తరుణి కిన్నెరసాని కెరటాలు తగ్గింది
వనరింది వనరింది
వనరి కిన్నెరసాని
మండియారిన నిప్పుమాద్రిగా నారింది
తనకర్మ మింతియేయని లోన ననుకుంది
తన కింక పతితోడి తగులు లేదనుకుంది
చేతులారా తాను
చేసుకున్నా నాని
యింతి కిన్నెరసాని యేడ్చినా యేడ్పులూ
సుదతి కిన్నెరసాని చూపినా దుఃఖమూ
అవికూడ జలములై ఆమెలో కలిసినై
నీలిమబ్బుల బోలు
నిడివి నీ చేతుల్లు
నన్నింక కౌగిలించగరావు కాబోలు
కడుప్రేమతో చేరగా తీవు కాబోలు
నెమ్మదిగ నా యొడల్‌ నిమురవు కాబోలు
నేను కోపము నంది
నీ ప్రక్కనుండగా
వలదన్నకొద్ది నాపదము లొత్తుచు నీవు
తెలచి కౌగింటిలో తేర్చుకుంటూ నీవు
నాఱొమ్ము తలచేర్చగా రావు కాబోలు
తలిరాకువంటి మె
త్తని యెఱ్ఱ పెదవితో
తార్చి నా మోము నద్దగరావు కాబోలు
నా యొడల్‌ మివుల నందపుకుప్ప యని చెప్పి
ఎల్ల తావులను ముద్దిడరావు కాబోలు
అని సన్న గొంతుతో
వనరి కిన్నెరసాని
రొద యడంగిన పావురాయి గొంతుకవోలె
తనలోన తానేమొ మెలమెల్ల రొదచేసి
కొనుచు పల్లపు నేలకును డిగ్గి పడిపోయె
జలదేవతలు వచ్చి
నెలత కిన్నెరసాని
పదమంచు పదమంచు బలవంతపెట్టంగ
మరిమరీ పతిచుట్టు తిరిగి కిన్నెరసాని
వలవలా యేడ్చింది పలపలా కుందింది
జలదేవతలు వచ్చి
చలపెట్ట పతిగుట్ట
విడలేక విడలేక పడతి కిన్నెరసాని
చనలేక చనలేక చాన కిన్నెరసాని
పోలేక పోలేక బాల కిన్నెరసాని
జలదేవతలు వచ్చి
చలపెట్ట పతిగుట్ట
వదలగా లేక యా ముదిత కిన్నెరసాని
తల్లి దగ్గరనుండి తనమెడకు పలుపోసి
లాగగా బడ్డట్టి లేగలా సాగింది
సాగింది సాగింది
జాలుగా పారింది
ఆవు పొదుగున పాలు ధారకట్టిన యట్లు
వనదేవతలు నీళ్ళు వొలకబోసినయట్లు
తల్లి చల్లని ప్రేమ వెల్లివారినయట్లు
జాలుగా పారింది
జలజలా పొంగింది
లేతయెండలు దిశాళిని క్రమ్ముకొన్నట్లు
పాలాట్రగడము పాతర తీసికొన్నట్లు
ముద్దరాలిమనస్సు పొంగి వచ్చినయట్లు
జలజలా పొంగింది
బిలబిలా నడచింది
పరికిణీ తొక్కాడు పదియేండ్ల కన్యలా
చిన్నిగంతులువేయు తెల్లనాఁబెయ్యలా
పసిపాప సెలవి వారిన బోసినవ్వులా
నడిచింది నిడచింది
నడిచి కిన్నెరసాని
నడిచి యందాలు చందాలుగా నడిచింది
గడియలోపల పెద్దకాల్వగా కట్టింది
అడవితోగుల రాణి యన్నట్లు తోచింది
ఏమి కిన్నెరసాని
ఏమి కిన్నెరతోగు
బంగారుతీగలో పానకమ్మైపోయె
కొబ్బరిపాలు వాకలు కట్టినట్లయ్యె
వెయ్యావులొకసారి పిదికినట్లైపోయె
జలదేవతల వెంట
సాగి కిన్నెరసాని
తెలితారకల వెంట వెలుగులా తోచింది
తలిరుపూవుల వెంట తావిలా తోచింది
తెనుగుపాటల వెంట తీపిలా తోచింది
వొయ్యారి నడలతో
వచ్చు కిన్నెరసాని
వనదేవతలు పూలు పై క్రుమ్మరించారు
భూదేవతలు ఎదురుపోయి దీవించారు
వాయుదేవతలు రమ్మని పాటపాడారు
పాఱు కిన్నెరసాని
పజ్జలందున నిల్చి
కోకిలా తన గొంతుకొన విచ్చి పాడింది
పికిలిపిట్టలు మేలిరకముగా కూసినై
తెలుగుపిట్టలు వొళ్ళుతెలియక పాడినై
ఎంతదూరముపోయె
నంతదూరముదాక
తెఱవ కిన్నెర వెన్కతిరిగి చూచుచె పోయె
పడతి కిన్నెర తిరిగి పతిని చూచుచె పోయె
నాతి కిన్నెర తిరిగి నాథు చూచుచె పోయె
పతివంక చూచుచూ
పడతి కిన్నెరసాని
పోయేటివేళలో భూమి తనంతగా
తోరమై విరియుచూ త్రోవగా చేసింది
కెరటాలతో చొచ్చుకోదు కిన్నెరసాని
బ్రతికి వున్నప్పుడూ
అతివ కిన్నెరసాని
ఎంత ఒయ్యారియో ఎంత నెమ్మదిచానొ
అంత ఒయ్యారమ్ము అడుగడుగుపోయింది
అంత యిల్లాలి నెమ్మదితనము చూపింది
AndhraBharati AMdhra bhArati - kavitalu - kinnerasaani paaTalu - kinnera naDakalu ( telugu andhra )