కవితలు కిన్నెరసాని పాటలు కిన్నెర పుట్టుక
2. కిన్నెర పుట్టుక
ఓహో కిన్నెరసానీ
ఓహో కిన్నెరసానీ
ఊహామాత్రము లోపల
నేల నిలువవే జవరాలా
కరగిపోతి నిలువెల్లను
తరలించితి నా జీవము
మరిగిపోయి నా గుండియ
సురిగిపోయెనే ప్రియురాలా ఓహో...
తనయెడ తప్పేయున్నది
అనుకొనవే నాథునిదెస
వనితలు నీకలె కఠినలు
కనిపించరువే యెందును ఓహో...
ఇంత కోప మేమిటికే
యింత పంత మేమిటికే
ఇంతులు జగమున పతులకు
నింతులు సేయుదురటవే ఓహో...
ఇప్పుడెగదె నా కౌగిట
కప్పితి నీ శోకమూర్తి
అప్పుడె నిలువున నీరై
యెప్పుడు ప్రవహించితివే ఓహో...
అంత పగే పూనితివో
అంత కోప మొందితివో
ఇంతీ నను శిక్షింపగ
నింకొక మార్గము లేదటె ఓహో...
రాలపైన తొలినాళుల
కాలిడగా నోర్వలేవు
రాలను కొండల గుట్టల
నేలా ప్రవహించెదవో ఓహో...
నీవు మహాపతిశీలవు
కావని నేనంటినటే
అటు లంటిన నాకంఠము
కటారి త్రెంచకపోతిన ఓహో...
వెన్నెలవలె తెల్లని నీ
సన్నని మేనిపసందులు
కన్నులకును కనిపించెను
చిన్ని తరగ చాలువోలె ఓహో...
నీ యొయ్యారపు నడకలు
మాయురె కనిపించెను పో
మలకలుగా ప్రవహించిన
సెలయేటి భవన్మూర్తిని ఓహో...
నీ నవ్వులు నురుగులుగా
నీ వళులవి తరగలుగా
నీ కన్నులు మీనులుగా
నీ కరణిని ప్రవహించెదు ఓహో...
నీ జఘనము నిసుకతిన్నె
గా జూచిన నాకన్నులు
ఊడిపడవు నేలపైన
నురిసిపోవు లోనె లోనె ఓహో...
మున్ను భగీరథ భూపతి
వెన్ను వెంట పరుగెత్తిన
అన్నాకధునీ వైఖరి
నున్నది నీ చన్నత్రోవ ఓహో...
పరుగెత్తెడు నీ వేణీ
బంధము పూనితి చేతను
కరమున వేణికి బదులుగ
కాల్వగట్టె నీటిపొరలు ఓహో...
ఎడమచేత నీకొంగును
ఒడిచిపట్టుకొంటి చెలీ
తడిచేతను కొంగులేక
తడబడితిని ప్రియురాలా ఓహో...
నీపాదమ్ములు మోచిన
నా ఫాలమ్మున చెమ్మట
ఈ పగిదిని వాగువైన
నీపై ప్రేమము చూపెడి ఓహో...
నీవే నా జీవితమణి
వీవే నాజీవేశ్వరి
వీవే నా చూడామణి
వీవేనే ప్రియురాలా ఓహో...
నీవే యిట్లైతివిపో
జీవము లుండునె నామై
నీవలె నేను ప్రవాహం
బై వచ్చెద రానీవే ఓహో..
ఈవు రసాకృతి వగుటను
ఈ వైఖరి ప్రవహించితి
నేను శిలాహృదయుండను
పూనుదునె ధునీవైఖరి ఓహో...
మునుపే నీకన్నులు గని
యనుకొంటిని నీవు నదీ
వనితవు మానుషజన్మము
కనినా వని మనసులోన ఓహో...
ఈ తరగల కదలికలో
ఓ తరుణీ నీ కంఠ
శ్రీ తారుణ్యము తోచగ
పోతివటే పరుగులెత్తి ఓహో...
నిను కౌగిట నదిమిన నా
తనువుపులక లణగలేదు
కను విప్పితినో లేదో
నిను కానగ లేనైతిని ఓహో...
ఈ దురదృష్టుడ నే మని
రోదించెద నడవులందు
నీదే నీదే తప్పని
వాదించిన వడవు లెల్ల ఓహో...
ఇదిగొ చేతులను చాచితి
నేడ్చుచుంటి కంఠ మెత్తి
ముదితా వినిపించుకొనక
పోతివటే ప్రియురాలా ఓహో...
నీకై యేడిచి యేడిచి
నాకంఠము సన్నవడియె
నా కన్నులు మందగించె
నా కాయము కొయ్యబారె ఓహో..
ఈ యేడుపు రొదలోపల
నా యొడలే నే నెఱుగను
నా యీ దేహ మిదేమో
ఱాయివోలె నగుచున్నది ఓహో...
AndhraBharati AMdhra bhArati - kavitalu - kinnerasaani paaTalu - kinnera puTTuka ( telugu andhra )